రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 28:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఆషాడం బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.మున్సిపల్ పరిధిలో ఉన్న మహంకాళి దేవాలయం 40వ వార్షికోత్సవం సందర్భంగా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.ఉదయం నుండి రామాయంపేట పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది. రామాయంపేట పట్టణంలో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో మహిళలు మట్టికుండలో అమ్మవారికి నైవేద్యం తీసుకొని డప్పు చప్పుళ్ళతో పోతరాజుల విన్యాసాల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి బోనాలను నైవేద్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.పట్టణ ప్రజలే కాకుండా పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయ ప్రాంగణంలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని మౌలిక వస్తువులు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణమంతా పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రాంగణంలో మున్సిపల్ కార్మికులు ఎలాంటి చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు తొలగించారు, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా స్థానిక ఎస్సై రంజిత్ కుమార్ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు.పట్టణంలోని అన్ని పార్టీల నాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.గత మూడు రోజుల నుండి మహంకాళి దేవాలయంలో ఆషాడ మాస ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖసంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగుండాలని వారు అమ్మవారిని కోరుకున్నట్లు ప్రజలు తెలిపారు.
