★ గ్రామపంచాయతీలకు సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా వారి జీతాలు చెల్లించాలి.
★ టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి,
తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జి. ముత్తయ్య.
నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని, గ్రామ పంచాయతీలకు సంబంధం లేకుండా ప్రభుత్వమే వారి జీతాల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, నేరుగా వారికి జీతాలు చెల్లించాలని టియుసిఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి, తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జి. ముత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టి యు సి ఐ అనుబంధ తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం పినపాక మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, ఎంపీడీవోకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలీ,చాలని వేతనాలతో, చెత్తా,చెదారం మధ్య పనిచేస్తూ గ్రామపంచాయతీ కార్మికులు తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి, వీధులను శుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతుంటే గ్రామపంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. వారికి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వకుండా తక్కువ వేతనాలు చెల్లిస్తూ, ఆ వేతనాలు కూడా ప్రతినెలా చెల్లించకుండా నెలల తరబడి పెండింగ్ పెడుతున్నారు అన్నారు. నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా పెండింగ్ పెడితే వారు కుటుంబాలను ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, గ్రామపంచాయతీ కార్మికుల వేతనాల కోసం ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించి ప్రభుత్వమే నేరుగా వారి జీతాలు చెల్లించాలని, పి ఆర్ సి సూచించిన వేతనాన్ని, వారి బేసిక్ వేతనంగా నిర్ణయించాలని, అప్పటివరకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, జీవో నెంబర్ 51 ను సవరించి మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, వివిధ కేటగిరీలను యధావిధిగా కొనసాగించాలని,గ్రామపంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, ఇన్సూరెన్స్, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ కార్మికులకు 5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, వారి స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి అవకాశం కల్పించాలని, తదితర సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ పినపాక మండల అధ్యక్ష, కార్యదర్శులు చంటి, రామకృష్ణ, నాయకులు దాసరి. రవి, నాగరాజు ఈసం. వెంకట్ నారాయణ, కొమరం. లక్ష్మయ్య, కొమరం. భాస్కర్, కోడిరెక్కల. తిరుపతి, బుజ్జి బాబు, సుమన్, కొమరం. వెంకటనారాయణ, సంపత్ తదితరులు పాల్గొన్నారు.