పాశవిక సైనిక దాడులను నిలిపివేయాలి
– జూలై 1న కగార్ వ్యతిరేకదినం పాటించండి
– సిపిఐ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ
నేటి గదర్, జూన్ 26,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ 9052354516 :
మన దేశ ప్రజలపై కొనసాగుతున్న నిర్ధాక్షిణ్యమైన పాశవిక సైనిక దాడులను వ్యతిరేకిస్తూ జూలై 1న జరుగుతున్న కగార్ వ్యతిరేక దినాన్ని పాటించాలని సిపిఐ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ బుధవారం ఒక ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్య భారతంలోని దండకారణ్యంలో రాజకీయాధికారం కోసం, జల్, జంగల్, జమీన్ కోసం పోరాడుతున్న విప్లవకారులపైన, ఆదివాసీలపైన నూతనంగా కగార్ పేరుతో సైనిక క్యాంపెయిన్ చేపట్టి ఆరు నెలలుగా ఊచకోత మొదలు పెట్టారని ప్రకటన ద్వారా ఆరోపించారు. బీజాపూర్ జిల్లా ముదువెండి గ్రామంలో ఆరు నెలల పాపతో మొదలైన ఊచకోత వారానికొక ఘటనతో ఇంకా కొనసాగుతూనే ఉందని, ఆరు నెలల పాప నుండి మొదలుకుని ఆరు పదులు దాటిని ముసలి వాళ్ళను కూడా వదలకుండా సామూహిక హత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికి 130కి మందిపైగా హత్యలు చేశారని ఆరోపించారు. పిట్టపడా, చిపురు బట్టి, కొర్చిల్, పిడియా, ఆపటోలా, కాకూర్ లాంటి అమానవీయ చర్యలకు పాల్పడుతూ నరసంహారం సృష్టిస్తున్నారని, హత్యలకు గురైనా వారి శవాలకు డ్రెస్ లు తొడిగి ఎన్ కౌంటర్లుగా చిత్రీకరిస్తున్నారు అంటూ ఆరోపించారు. భారత దేశంలో జరుగుతున్న ఇంతటి నరసంహారాన్ని చూసి స్పందించిన అంతర్జాతీయ సమాజం ఏకమై భారత ప్రజాయుద్ధాన్ని కాపాడుకోవడానికి అమెరికా, లాటిన్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా ఖండాలాలో కగార్ పేరుతో చట్ట విరుద్ధంగా జరుగుతున్న ఫాసిస్టు దురాఘాతాలను వ్యతిరేకిస్తున్నారని వెల్లడించారు. అయా దేశాల్లో కగార్ వ్యతిరేక ప్రదర్శలను చేపడుతున్నారని తెలిపారు. మన దేశ ప్రజలపై కొనసాగుతున్న నిర్ధాక్షిణ్యమైన పాశవిక సైనిక దాడులను తక్షణమే నిలిపి వేయాలని, మోహరించిన బలగాలను వెనక్కి తీసుకోవాలని భారత ప్రజాయుద్ధ అంతర్జాతీయ సంఘీభావ కమిటీ జూలై 1వ తేదీన ప్రపంచ కగార్ వ్యతిరేక దినంగా పాటించాలని ప్రకటించిందని పేర్కొన్నారు. ఈ పిలుపుకు మద్దతుగా తెలంగాణ విప్లవ ప్రజలు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు, రచయితలు, ప్రజా హితం కోరుతున్నవాళ్ళు జూలై 1న కగార్ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.