నేటి గదర్ డెస్క్:
జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లా మాచేడి ఏరియాలో ఇండియన్ ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కథువా నుంచి 150 కి.మీ దూరంలో ఉన్న మాచేడి- కిండ్లీ- మల్హర్ రోడ్డుపై పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ దాడి జరిగింది. గాయపడిన జవాన్లను వెంటనే ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. టెర్రరిస్టులు మొదట కాన్వాయ్‌పై గ్రనేడ్ విసిరారని అధికారులు వెల్లడించారు. అనంతరం జవాన్లపై కాల్పులు జరిపారని చెప్పారు. జవాన్లు అప్రమత్తమై ఎదురుకాల్పులు జరిపేలోపే టెర్రరిస్టులందరూ దగ్గరలోని అడవిలోకి పారిపోయారని వివరించారు. సమాచారం అందుకున్న వెంటనే అదనపు బలగాలు ఘటనాస్థలానికి చేరుకుని కూంబింగ్ చేపట్టినట్లు తెలిపారు. గడిచిన 48 గంటల్లో జమ్మూ ప్రాంతంలో జవాన్లపై టెర్రరిస్టులు దాడికి పాల్పడటం ఇది రెండోసారి. ఆదివారం రాజౌరీ జిల్లాలోని ఆర్మీ క్యాంపుపై కాల్పులు జరిపారు.