వర్షానికి తడిసిన మట్టి రోడ్డు. అడుగులో అడుగు వేసుకుంటూ వస్తోంది ఓ నాలుగేళ్ల చిన్నారి. అకస్మాత్తుగా కాలు మట్టిలో కూరుకుపోయింది. ఇంకేముంది భుజానికి ఉన్న పుస్తకాల బ్యాగ్‌తోపాటు తానూ కింద పడింది. ఒకవైపు కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. అయినాసరే తేరుకుంది. అసలే స్కూల్‌కి మొదటి రోజు. ఎట్టకేలకు పాఠశాలకు చేరుకుంది. ఆ చిన్నారిని చూసిన హెడ్ మాస్టర్ ఆశ్చర్యపోయారు. ‘పట్టుదల అంటే ఇలా ఉండాలి. నువ్వు లీడర్ అవుతావు’ అంటూ కితాబిచ్చారు. ఆయన మాటలు ఇప్పుడు అక్షర సత్యాలయ్యాయి. ఆ అమ్మాయే తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ కాలంలో డీఎస్‌పీ నుంచి ఐపీఎస్‌గా పదోన్నతి పొందింది. అచీవర్స్ స్టోరీస్ సగర్వంగా అందిస్తున్న ఐపీఎస్ అధికారి బడుగుల సుమతి సక్సెస్ స్టోరీ..
సుమతి.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర లేని పోలీస్ అధికారి. వరంగల్‌లో తొలి పోస్టింగ్‌లోనే పోలీస్ అంటే ఎలా ఉండాలో చూపిన ధీశాలి. స్నేహితులు టైగర్‌గా పిలుచుకుంటారు. ఎంతో మంది బాధితులకు ఆమే ఆపన్న హస్తం. ఆమె గుమ్మం తొక్కితే న్యాయం దక్కుతుందన్నది ప్రజలకున్న భరోసా. సామాన్యుల పోలీస్ ఆమె. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటారు. ఎంతటి ప్రెషర్ వచ్చినా ధర్మాన్ని వీడరు. బాధితులను చూస్తే చలించిపోతారు. ఆమెను చూసి స్ఫూర్తి పొంది ఎందరో పోలీసులయ్యారు. పైకి గంభీరంగా ఉన్నా మనసు వెన్న.
మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ తాలూకా కలుగోట్ల సుమతి స్వస్థలం. ఆమె తండ్రి 300 ఎకరాల ఆసామి తిరుపతి రెడ్డి. దాన, ధర్మాలు చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. సుమతికి అన్న, అక్క, ఇద్దరు చెల్లెల్లు. ఆయనకు డబ్బు చింతన లేదు. అసలే పంటలు అంతంత మాత్రంగా పండేవి. నడక దారిలో శ్రీశైలం వేళ్లే శివ భక్తులకు ఉగాది సమయంలో ఓ వారంపాటు రోజూ వందలాది మందికి అన్నదానం చేసేవారు. ఏడాది పొడవునా శ్రమించగా వచ్చిన ఆదాయం కాస్తా దాన ధర్మాలకే ఖర్చయ్యేది. పిల్లల కోసం ఆయన ఏమీ దాచలేదు. అయితే పిల్లలు చదువుకుంటేనే భవిష్యత్ బాగుంటుందని భావించింది సుమతి తల్లి. ఊర్లో స్కూల్ లేకపోవడంతో కర్నూలులో హాస్టల్‌లో ఉంచి మరీ చదివించింది. పాడి ద్వారా వచ్చిన డబ్బులను ఒక్కో రూపాయి పోగుచేసి పిల్లల ఫీజులకు కట్టేది.
ఎల్‌కేజీ నుంచే సుమతి హాస్టల్ ఉండాల్సి వచ్చింది. ఇష్టం లేకున్నా బలవంతంగా ఆమెను పంపారు. మూడో తరగతి వచ్చేసరికి వారి కుటుంబం కర్నూలుకు మారింది. తాను ఏడవ తరగతిలో ఉండగా తిరిగి సొంత ఊరికి మకాం మార్చారు. అప్పుడు బంధువుల ఇంట్లో ఉండి చదువుకుంది. ఇంటర్ నిమ్మకూరు రెసిడెన్షియల్ కాలేజీలో పూర్తి చేసింది. మొత్తం 33 మంది విద్యార్థులకుగాను 31 మంది మెడిసిన్‌లో చేరారు. కాలేజీ టాపర్ అయినప్పటికీ సుమతి మాత్రం డిగ్రీ అగ్రికల్చర్ ఎంచుకున్నారు. 2000 సంవత్సరంలో గ్రూప్–1 సెకండ్ టాపర్‌గా నిలిచి డీఎస్‌పీగా ఎంపికయ్యారు. చిన్ననాటి నుంచి ఉన్న పట్టుదలే ఆమెకు ఈ విజయాన్ని తెచ్చిపెట్టింది. 2007లో ఐపీఎస్‌గా పదోన్నతి సాధించారు. ఆరేళ్ల సర్వీసుకే ఒక గ్రూప్–1 అధికారి ఐపీఎస్ కావడం తెలుగు రాష్ట్రాల్లో అదే తొలిసారి. ఇప్పటికీ ఈ రికార్డు ఆమె పేరునే ఉంది. విధి నిర్వహణలో ఆమె చూపిన ప్రతిభ కారణంగానే ఈ గౌరవం దక్కింది. సైబర్ క్రైమ్స్ విభాగానికి వన్నె తెచ్చారు. ఎంతో మంది సైబర్ నేరగాళ్లను బోనులో నిలబెట్టారు.
ముందు నుంచి సుమతి చాలా యాక్టివ్. అందరితో కలిసిపోయేది. ఇంట్లో కూలీలతో కలిసి పనిచేసేది. సుమతమ్మ పెద్ద పోలీసాఫీసరో, కలెక్టరో అవుతుందని ఊర్లోవాళ్లు అనేవారు. తన లక్ష్యమూ ఎప్పుడూ ఉన్నతంగా ఉండేది. క్లాస్‌లో తానే లీడర్. అన్నింటా ముందుండేది. ఆటలైనా, చదువులైనా మొదటి స్థానం రావాల్సిందే. 1998లో డిగ్రీ పూర్తి అయిన వెంటనే గ్రూప్స్ కోచింగ్‌కు హైదరాబాద్ పయనమైంది. ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న వసంత అనే అధికారి బస్‌లో పరిచయమైంది. గ్రూప్స్ సాధించాలన్న లక్ష్యంతో భాగ్యనగరికి వెళ్తున్నానని చెప్పిన సుమతి మాటలకు ఆమె ముగ్ధురాలైంది. ఇంటికి ఆహ్వానించి మరీ మంచి కోచింగ్ సెంటర్‌తోపాటు హాస్టల్ వెతికి పెట్టింది. రెండేళ్లు పుస్తకమే ప్రపంచంగా శ్రమించి గ్రూప్–1 సాధించింది సుమతి.
చిన్ననాటి నుంచి సుమతి చాలా మొండిగా ఉండేది. ఆ మొండి తనమే కష్టాలను ఎదిరించేలా చేసిందని అంటారామె. ‘ఇంటర్‌లో ఉన్నప్పుడు హాస్టల్‌కు వెళ్లేందుకు పయనమయ్యాను. విజయవాడలో దిగేసరికి రాత్రి 9 అయింది. అక్కడి పరిస్థితి చూసి అమ్మాయిలకు రక్షణ లేదని భావించాను. ఒక్క క్షణం కూడా ఉండొద్దని నిర్ణయించుకుని బస్ ఎక్కాను. నిమ్మకూరుకు చేరుకునే సరికి రాత్రి 12 అయింది. హైవే నుంచి ఊర్లోకి 1.5 కిలోమీటర్లు నడవాలి. రోడ్డుపైన తాగుబోతులు ఉండనే ఉన్నారు. అయితే బతుకుతాను. లేదంటే చస్తాను అని మనసులో ధైర్యం తెచ్చుకుని నడక సాగించా. ప్రిన్సిపల్ ఇంటికి చేరుకున్నాను. నా ధైర్యాన్ని చూసి ఆయన చాలా మెచ్చుకున్నారు’ అని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు సుమతి. వరంగల్‌లో డీఎస్‌పీగా తొలి పోస్టింగ్‌లోనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. నేరగాళ్లకు సింహ స్వప్నంగా నిలిచారు. క్రమశిక్షణ తప్పిన పోలీసులనూ దారిలోకి తెచ్చారు. ధర్మాన్ని వీడవద్దన్న తన నానమ్మ మాటలను గుర్తు చేసుకుంటారు సుమతి.
డిగ్రీ క్లాస్‌మేట్ శ్రీనాథ్ రాజుని ప్రేమ వివాహం చేసుకున్నారు సుమతి. “16 ఏళ్ల సర్వీసులో ఏనాడూ శ్రీనాథ్ నా నుంచి సాయం ఆశించలేదు. పైరవీలు చేయలేదు. నా మనసుని దగ్గరగా చూస్తారు. నేను చెప్పకపోయినా నా మనసుని అర్థం చేసుకుని భుజం తడతారు. అయితే చాలాసార్లు ఇద్దరు పిల్లలను వదిలేసి వెళ్లాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో మేం మాట్లాడుకునే అవకాశమూ వచ్చేది కాదు. నా కోసం ఆయన కెరీర్‌ను వదులుకున్నారు. నాలాంటి అమ్మాయి ప్రేమ పెళ్లి చేసుకుంటుందని ఎవరూ ఊహించలేదు” ఆని నవ్వుతూ చెప్పారు. మనసులో సంకల్పం ఉండాలిగానీ ఎదైనా సాధించొచ్చని అంటారామె.








