మరణం లో వీడని భార్యాభర్తల బంధం
భర్త చనిపోయిన కొన్ని గంటలకి భార్య మృతి
పినపాక లో విషాద ఛాయలు
నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:కలకాలం తోడుంటానని పెళ్లి మండపంలో ఏడడుగులు సాక్షిగా ఒక్కటైన ఆ దంపతులు మరణంలోనూ భార్యాభర్తల బంధాన్ని వీడలేదు. అనారోగ్యంతో భర్త మృతిచెందగా, ఆ బాధను తట్టుకోలేక భార్య కొన్ని గంటల వ్యవధిలో మృతి చెందింది. ఈ హృదయవిదాకర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో జరిగింది. కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పినపాక మండలం పినపాక చెందిన సుంకరి రాములు(80) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతుని భార్య సుంకరి నర్సమ్మ(75) సైతం కొన్ని నెలలుగా అ నారోగ్యం మంచానికే పరిమితమై ఉన్నది. ఈ నేపథ్యంలో నరసమ్మ సైతం భర్త మృతి చెందిన కొన్ని గంటలకు సోమవారం రాత్రి మృతి చెందినట్లు నరసమ్మ కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా మృతుడు సుంకరి రాములు ఉమ్మడి పినపాక పంచాయతీకి రెండు పర్యాయాలు సర్పంచిగా సేవలందించారు. భార్యాభర్తలు ఒకే రోజు చనిపోవడంతో పినపాకలో విషాద ఛాయలు అలముకున్నాయి. 60 ఏళ్ల పాటు ఒకరినొకరు విడిచి ఉండలేని ఈ దంపతులు ఒకేరోజు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చివరకు చావులో కూడా ఒకటే అయ్యారని మృతుల బంధువులు ఆవేదన వెలిబుచ్చారు. మృతులకు దహన సంస్కారాలు మంగళవారం నిర్వహించనున్నారు. మృతులకు కొడుకు సుంకరి సాంబ ఉన్నారు. ఈ సంఘటన తెలిసిన వివిధ పార్టీల నాయకులు మృతుల పార్థివ దేహాలకు ఘన నివాళి అర్పించి మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
