నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం: ఓ అతి సామాన్యమైన వ్యక్తి లా ఓ మండల తహశీల్దార్ బెల్ట్ షాపులోకి వెళ్లాడు… అది కూడా లుంగీ కట్టుకొని… పాత చొక్కా వేసుకొని ఎవరు గుర్తుపట్టని విధంగా బెల్ట్ షాప్ లోకి వెళ్ళాడు. ఆ బెల్ట్ షాప్ పై ఆకస్మికంగా దాడి చేసి హెచ్చరికలు జారీ చేశారు. దీనికి కారణం లేక పోలేదు. బాలికల వసతి గృహానికి దగ్గరగా ఆ బెల్ట్ షాపులు ఉండడమే కారణం. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం బట్టుపల్లి ప్రధాన రహదారి పక్కన బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ బెల్ట్ షాపులకి కొంత దూరంలోనే కస్తూరిబా గాంధీ విద్యాలయం(KGBV) ఉంది. బెల్ట్ షాప్ మూలంగా ఆ విద్యాలయంలో ఉన్న బాలికల చదువుకు అంతరాయం కలుగుతుందని పలుమార్లు బాలికల పేరెంట్స్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదు. ఈ నేపథ్యంలో కరకగూడెం మండల తాసిల్దారుగా బాధ్యతలు స్వీకరించిన కే. నాగప్రసాద్ ఆదివారం రాత్రి కస్తూరిబా గాంధీ విద్యాలయం,చిరమళ్ల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయా పాఠశాలల సమీపంలో బెల్ట్ షాపులు యదేచ్చగా అర్ధరాత్రి వరకు నడుస్తున్నాయని గమనించిన తాసిల్దార్ కే నాగప్రసాద్ ఆయా బెల్ట్ షాపులకు వెళ్లి రైడ్ నిర్వహించారు. బెల్ట్ షాపుల మూలంగా ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు పడుతున్న అవస్థలను ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. వసతి గృహాల సమీపంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఒక తాసిల్దార్ ఎవరు గుర్తుపట్టని విధంగా సామాన్యమైన వ్యక్తుల వచ్చి వసతి గృహాలను తనిఖీ చేయడంతో పాటు వాటికి సమీపంలో ని బెల్ట్ షాపులపై కొరడా జులుపించిన తాసిల్దార్ కే నాగప్రసాద్ ను ఆయా ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు, మండల ప్రజలు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.