నేటి గదర్ న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాచలం/మణుగూరు : గత పదేళ్లలో ఎన్ని ఇళ్లు ఇచ్చారని, డబుల్ బెడ్రూం బొమ్మకే పరిమితమైందని మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యనించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన సందర్భంగా భద్రాచలం, మణుగూరు ప్రాంతాల్లో జరిగిన సభల్లో పొంగులేటి మాట్లాడారు. రాష్ట్రాన్ని రూ.7లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిన గత ప్రభుత్వం భద్రాద్రి రాముడికి రూ.100కోట్లు కూడా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదో గ్యారంటీగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తామని తెలిపారు. దళిత, గిరిజనులకు రూ. 6లక్షల చొప్పున, మిగిలిన వారికి రూ. 5 లక్షల చొప్పున ఇంటి నిర్మాణానికి ఇస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2.90 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్ల టెండర్లు పిలిచి 1.49 లక్షలు మాత్రమే నిర్మించి.. కేవలం 90వేలు మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేసిందన్నారు. గత ప్రభుత్వంలాగా పింక్ కండువాలకే కాకుండా… గ్రామసభలు నిర్వహించి అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వర్తింపజేస్తామని అన్నారు. ఈ సభల్లో మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు ప్రసంగించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రోహిత్ చౌదరి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, మట్టా రాగమయి, రాంచందర్ నాయక్, తెల్లం వెంకట్రావ్, కూనంనేని సాంబశివరావు, రాందాస్ నాయక్, డీసీసీ అధ్యక్షులు పోదెం వీరయ్య, పువాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు, మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, బొర్రా రాజశేఖర్ , మువ్వా విజయ బాబు, తుళ్లూరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
