– 2 (ప్రధాన) అధికార పార్టీలతో తలపడుతున్న బీఆర్ఎస్..!
– కెసిఆర్ రోడ్ షో ఏ విధమైన ఫలితాలను ఇవ్వనుంది..!
– బీఆర్ఎస్ ప్రధాన నేతలు పార్టీ మారడంతో కారు స్పీడు తగ్గిందా..?
– పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ కు డూ ఆర్ డై అన్నట్లేనా..?
– నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక కథనం
నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 29, డెస్క్/ భద్రాద్రి కొత్తగూడెం :
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా పేరొందిన టిఆర్ఎస్, పదేళ్లు తిరుగులేని ఏకచత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ టిఆర్ఎస్.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు అపరచానిక్యుడుగా పేరొంది, తన మాటలతో.. యాసతో… బాసతో…. ప్రత్యర్థులను ఇరుకున పెట్టగలిగే చాతుర్యం కలిగిన కేసీఆర్ అధినేతగా ఉన్న పార్టీ బీఆర్ఎస్. అటువంటి పార్టీ నేడు లోక్సభ ఎన్నికల్లో డూ ఆర్ డై పరిస్థితుల్లో ఉన్నది అంటే, అసలు సిసలైన అగ్నిపరీక్ష బీఆర్ఎస్ ఎదుర్కోనున్నది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
– 2 (ప్రధాన) అధికార పార్టీలతో తలపడుతున్న బిఆర్ఎస్..!
రానున్న లోక్సభ ఎన్నికల్లో అటు కేంద్ర రాజకీయాల్లో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ, ఇటు తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయ్యుండి, ప్రత్యర్థులకు ఏ చిన్న అవకాశం దొరకకుండా ప్రజల్లోకి వెళుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ రెండు పార్టీలతో బిఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో పోటీ పడనుంది. అయితే రానున్న ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయో..! అని రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడంతో ఆ పార్టీ నేతలు తమ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను.. రానున్న రోజుల్లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేయబోయే కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే బిజెపి దేశవ్యాప్తంగా ఉనికిని చాటుకున్న పార్టీ అయి ఉండడంతో తెలంగాణలో సైతం రానున్న లోక్సభ ఎన్నికల్లో విజయ కేతనం ఎగరవేసేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా లోక్సభ ఎన్నికల్లో కేంద్రస్థాయి నాయకులు, ఇతర రాష్ట్రాల్లోనే బిజెపి ప్రజా ప్రతినిధుల సైతం తెలంగాణ రాష్ట్రం పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి హాజరవుతూ.. బిజెపి అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ శాసనసభ ఎన్నికల ఫలితాలను మరోసారి తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తుంది. ప్రత్యర్ధులకు ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా వారి వైఫల్యాలను ఎండగడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో జోష్ పెంచుతున్నారు. ఈ రెండు ప్రధాన జాతీయ పార్టీలతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ పోటీ పడనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను గెలిపించుకోవాలంటే తీవ్రస్థాయిలో కష్టపడాల్సి ఉంటుంది.
– కెసిఆర్ రోడ్ షో ఏ విధమైన ఫలితాలను ఇవ్వనుంది..!
తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, ఫోన్ టాపింగ్ కేసు, నేతల పార్టీ ఫిరాయింపు తదితర సమస్యలతో పాటు కెసిఆర్ అనారోగ్యంతో బాధపడుతుండడం బిఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లో తగులుతున్నాయని చెప్పవచ్చు. ఇదే తరుణంలో లోక్ సభ ఎన్నికలు రావడంతో పార్టీ పరిస్థితులను చక్కదిదేందుకు బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కెసిఆర్ తనదైన శైలిలో వ్యూహరచన చేస్తూ వన్ మ్యాన్ ఆర్మీ గా పోరాటం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ షో లు, సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ క్యాడర్లో కొత్త జోష్ ను నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. కెసిఆర్ ప్రసంగాలతో, ప్రచార కార్యక్రమాలతో పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో కొంతమేర కదలికలు వచ్చినప్పటికీ.. ఈ స్పీడు ఎన్నికల్లో సత్ఫలితాలను తెచ్చేందుకు సరిపోదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
– ప్రధాన నేతలు పార్టీ మారడంతో కారు స్పీడు తగ్గిందా..?
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. పది సంవత్సరాలు తిరుగులేని పార్టీగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బిఆర్ఎస్ ప్రస్తుతం తన ఉనికిని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ లో గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు, పార్టీలోని ప్రధాన నాయకులు పార్టీ నీ వీడి కాంగ్రెస్లో చేరిన విషయం ప్రజలకు తెలిసిందే. ఈ పరిస్థితుల్లో భారీ సంఖ్యలో కార్యకర్తలు, ఆ నాయకుల అభిమానులు సైతం తమ నాయకులతో కలిసి పార్టీని వీడారు. మిగిలిన టిఆర్ఎస్ కార్యకర్తలు తమకు ధైర్యం కల్పించే నాయకులు ఎవరు అనే అయోమయంలో ఉన్నట్లు పలువురు విశ్లేషిస్తున్నారు. ఈ నేపద్యంలో కార్యకర్తల్లో నెలకొని ఉన్న ఆందోళనను తరిమికొడుకు కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపడానికి బలమైన నాయకులు కృషి చేయాల్సి ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. తమ ముందు నడవాల్సిన నాయకుల్లోనే ఉత్సాహం లేకపోవడం… ఇతర పార్టీలు ప్రచార దిశగా దూసుకు వెళ్తుండడం టిఆర్ఎస్ కార్యకర్తల్లో తీవ్రమైన నిరాశను సృష్టిస్తుందని పలువురు మేధావులు పేర్కొంటున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో రానున్న లోక్సభ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీకి తమ అభ్యర్థులను గెలిపించుకోవడం అసలు సిసలైన అగ్నిపరీక్షయే అని చెప్పవచ్చు. లోక్ సభ ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు రానున్నాయో వేచి చూడాలి.