నేటి గద్దర్, మే 01, ములుగు / భద్రాద్రి కొత్తగూడెం:
ఉపాధి హామీ కూలీలు విద్యుత్ షాక్ కి గురైన సంఘటన బుధవారం ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ఉపాధి హామీ కూలీలు ఉదయం పని ముగించుకొని వస్తున్న క్రమంలో రాంనగర్ వద్ద ఉపాధి హామీ కూలీలు కూర్చున్న ట్రాక్టర్ కి, వారు పట్టుకొని ఉన్న గడ్డపారకి, ఆ ప్రాంతంలో కిందగా వేలాడుతున్న విద్యుత్ తీగలు తగలడంతో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న కూలీలకు ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురైనారు. భయాందోళనలకు గురైన కూలీలు ట్రాక్టర్ నుండి దూకడం వలన శంకపల్లి సుగుణ అనే మహిళకు కాలు తీవ్ర గాయం అయినది. షాక్ గురైన బండి సారంగం, నీలం కల్పన, జవాజ్ కొమురమ్మ, మామిడి లక్ష్మి లను వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూలీలు అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. లేకపోతే షాక్ గురైన వారు అక్కడికక్కడే మృతి చెందేవారని స్థానికులు అంటున్నారు. ప్రమాదానికి గురైన శంకపల్లి సుగుణ మాట్లాడుతూ… పని చేసుకుంటే బ్రతికే వారమని ఈ ఘటన వల్ల నాకు పని లేకుండా అయిందని, మెరుగైన వైద్యం చేయించి ఆదుకోవాలని కోరారు. గ్రామస్తులు ఎన్నోసార్లు విద్యుత్ తీగల గురించి సంబంధిత అధికారులకు తెలియజేశామని, ఇప్పటికైనా గ్రామంలో కిందకు ఉన్న తీగలను తొలగించి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులను కోరారు.