సైబర్ సెక్యూరిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన ములుగు ఎస్పీ డా. శబరిష్ ఐపిఎస్
నేటి గద్దర్, మే 2, ములుగు / భద్రాద్రి కొత్తగూడెం :
తెలంగాణ రాష్ట్రంలో సైబర్ క్రైమ్ నియంత్రణలో భాగంగా తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్థాపించబడింది. దీని నియంత్రణలో ప్రతి పోలీస్ కమిషనరేట్ ప్రతి జిల్లా కు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, జిల్లాలో సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా ఎస్ పి డా. శబరిష్ ఐపిఎస్ చేతుల మీదగా ములుగు డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేషన్ సెంటర్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ క్రైమ్ నేరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, వీరు జిల్లాలో వచ్చే సైబర్ కంప్లైంట్స్ ను పరిశీలన చేస్తారని తెలిపారు. ఆన్లైన్ మోసాల పట్ల అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఇన్వెస్టిగేషన్ లో సహాయం అందిస్తారని, ములుగు జిల్లాలో ఎక్కువగా గ్రామీణ జనాభా ఉన్నందున సైబర్ క్రైమ్ మోసాలకు గురికాకుండా ఎప్పటికప్పుడు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. అనుకోని విధంగా ఎవరైనా మోసపోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు డయల్ చేసి కంప్లైంట్ ఇవ్వవలసిందిగా కోరారు. ములుగు జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ నందు ఒక సైబర్ క్రైమ్ వారియర్ ని నియమించడం జరిగిందని వారిని సంప్రదిస్తే సహాయాన్ని అందిస్తారని, ఫోన్ ల లో వచ్చే ఎటువంటి లింక్ లను క్లిక్ చేయద్దని అపరిచిత వ్యక్తులకు బ్యాంకు సంబంధిత ఓటీపి, పాస్వర్డ్ వంటి సమాచారాన్ని తెలియచేయరాదని కోరారు. ఈ కో-ఆర్డినేషన్ సెంటర్ పర్యవేక్షణ అధికారిగా ఒక డిఎస్పి, ఒక ఇన్స్పెక్టర్, ముగ్గురు టెక్నికల్ స్టాఫ్ సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సదానందం, డి.ఎస్.పి సైబర్ క్రైమ్స్ సందీప్ రెడ్డి, డిఎస్పి డిసిఆర్బి రాములు, డి.ఎస్.పి ములుగు రవీందర్, సిఐ శ్రీధర్, సిఐ యాసిన్, సిఐ రంజిత్ కుమార్, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.