– ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన రెండు రైతు వేదికలలో ప్రతి మంగళవారం వ్యవసాయ శాస్త్రవేత్తలతో అవగాహన కార్యక్రమాలు.
– సేంద్రియ వ్యవసాయం పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి.
– వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
– రైతు నేస్తం కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్
నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి (కె కౌశిక్), జూన్ 11:
వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని,తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి తో కలిసి వ్యవసాయ రంగం లో రైతు నేస్తం కార్యక్రమం పై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లా రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ చంద్ర తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో విస్తరణ కార్యకలాపాలు బలోపేతం చేయడం కొరకు, రైతులలో నూతన సాంకేతిక పరిజ్ఞానంపై విస్తృత అవగాహన కల్పించుటకు పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో రెండు రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ హాళ్లను ప్రారంభించామని ప్రతి మంగళవారం రైతు వేదికలో రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో పంటల మార్పిడి, పంటలకు వచ్చే చీడలు, సేంద్రియ వ్యవసాయం తదితర అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. వెరైటీ పంటల సాగు చేసే రైతులతో, స్థానిక ఆదర్శ రైతులతో వారి అనుభవాలను ఇతర రైతులకు తెలియజేసే కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.
రైతులు వ్యవసాయ సాగులో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ సేంద్రియ ఎరువుల వినియోగం వైపు దృష్టి పెట్టాలన్నారు. అధిక దిగుబడినిచ్చే పంటలకు రైతులు ప్రాధాన్యత ఇచ్చి వాటి సేద్య వివరాలను పద్ధతులను స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకోవాలని రైతులకు సూచించారు.వ్యవసాయ సాగు మొదటి దశలో విత్తనాల ఎంపికలు రైతులు తొందర పడకూడదని విత్తనాల విషయంలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో రైతులు పండించే పంటలు ప్రపంచ దేశాలను ఆకర్షించే విధంగా ఉండాలని సేంద్రియ వ్యవసాయంపై రైతులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కాలానుగుణంగా పంట మార్పిడి చేయాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు ఆవిష్కరణలు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం కొరకు ప్రతి మంగళవారం, వ్యవసాయ అధికారులు రైతులతో రైతు నేస్తం పేరిట రైతు వేదికల్లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి సాంకేతికతను అనుసంధానం చేస్తూ రైతు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందేలా రైతులు నూతన విధానాలను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఏవో సంతోష్ , వ్యవసాయ రైతులు తదితరులు పాల్గొన్నారు..