★దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు
★ కార్మిక హక్కులను కాలరాస్తున్న పాలకులు
– ఎర్రజెండాలే అండా, దండా
★సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, Mla కూనంనేని
నేటి గదర్, జూన్ 23,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశి 9052354516 :
ప్రధాని నరేంద్రమోడి కార్పోరేట్ల కాపలాదారునిగా మారారని, మత విద్వేషాలకు కేంద్రబింధువైన బిజేపి చేతిలో ప్రజా స్వామ్యం అపహాస్యం పాలవుతోందని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక తాళ్లగొమ్మూరు సత్యనారాయణ స్వామి ఫంక్షన్ హాల్ లో ఏఐటియూసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2వ మహాసభ కడారు వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం జరిగింది. సభా ప్రాంగణంలో ఏఐటియూసి జెండాను సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఎగురవేశారు. అనంతరం అమరులకు నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ… ప్రధాని మోడీకి కార్మికులంటే చులకన భావమని, అందుకే పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి వారి హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. దేశానికి స్వతంత్రం రాకమునుపే ఏఐటియూసి కార్మిక సంఘంగా ఉందని, ఆ నాటి నుండి నేటి వరకు కార్మికుల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. హక్కులు సాధన కోసం కార్మిక లోకం నిప్పుకనెకలై పోరాటాలు చేయాల్సిన తరుణం మరో సారి ఆసన్నమైందన్నారు. కేంద్రంలో మూడో సారి అధికారం చేపట్టిన బిజేపి ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనులను వేలం వేసేందుకు కుట్రలు చేస్తోందని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా ఇందుకు కుట్రలు జరుగుతున్నాయని, దీనిని తిప్పికొట్టాలన్నారు. చట్టసభల్లో వందల కోట్లకు అధిపతులు, నేరగాళ్లు ఉన్నారని, ధనవంతులకు అనుకూలంగా చట్టాలను తయారు చేస్తున్నారని చెప్పారు. సంఘాలు పెట్టుకునే అవకాశం, నిరసనలు తెలిపే హక్కు మాయమైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కార్మిక సంఘాలే లేకుండా చేసే ప్రయత్నాలు చేశారన్నారు. ఇది కర్మాగారాల జిల్లా అని సింగరేణి, ఆర్టిసి, బిపిఎల్, నవభారత్, ఎన్ఎండిసి, హెవీవాటర్ ప్లాంట్, ఫిమాకేం, బ్యాంకు, ఎలసి, పోస్టల్, టెలికాం, గ్రామపంచాయితీ, మున్సిపల్, విఓఏ, 2వ ఏఎన్ఎం, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, మిషన్ భగీరధ, అంగన్వాడీ, ఆశ, హామాలు, భవన నిర్మాణ రంగానికి చెందిన వేలాది మంది కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏఐటియూసి సమరశీల పోరాటాలు నిర్వహిస్తోందని చెప్పారు. దేశ రక్షణ, కార్మిక హక్కుల పరిరక్షణ ఎర్రజెండాలతోనే సాధ్యమన్నారు. కార్మికుల కోసం పోరాడే అనేక సంఘాలు ఉన్నాయని, వారి సిద్ధాంతాలు వేరైనప్పటికీ పోరాటం ఒక్కటే అన్నారు. కార్మిక లోకం ఆర్థిక పోరాటంతో పాటు రాజకీయ చైతన్యాన్ని అలవర్చు కోవాలన్నారు. తొలినాళ్ల నుండి ఇప్పటి వరకు ఎందరో మేధావులు కార్మిక హక్కుల సాధన, పరిరక్షణ కోసం ఎన్నో త్యాగాలు చేసి మార్గదర్శకులయ్యారని, వారిని స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఎర్రజెండాలు నిరంతరం కార్మికులకు అండగా ఉంటాయని, కానీ ఆ జెండాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి ఏక జెండాగా మారాలని, అప్పుడే మనం అనుకున్న రాజ్యస్థాపన జరుగుతుందని కూనంనేని చెప్పారు.
అనంతరం ఏఐటియూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు మాట్లాడుతూ.. కార్మిక హక్కులు సాధించబడాలంటే పోరాటాలే శరణ్యం అన్నారు. ఏఐటియూసితో కార్మిక వర్గానికి ఎంతో మేలు చేకూరింది. నేడు అనేక సంఘాలు కార్మిక హక్కులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయన్నారు. దేశంలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ కార్మికులకు అన్యాయం జరిగే చర్యలకు పూనుకుంటు ఏఐటియూసి చూస్తో ఊరుకోదన్నారు. చాలీ చాలని వేతనాలతో అనేక సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు వెట్టి చాకిరీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాలకుల వల్ల పెట్టుబాడి దారులకు మేలు, కార్మికులకు అన్యాయం జరుగుతుందన్నారు.
సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ… పదేళ్లుగా బొగ్గు పరిశ్రమను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కుట్రల చేస్తోందని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా బొగ్గు గనులను వేలం వేసేందుకు హైదరాబాద్ కేంద్రంగా పావులు కదుపుతున్నారని చెప్పారు. బొగ్గు పరిశ్రమై ఆధారపడి లక్షలాది మంది కార్మికులు, వారి కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, పాలకుల వ్యతిరేక విధానాలకు నిరసనగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఏళ్లతరబడి ఆర్టీసి కార్మికులకు అన్యాయానికి గురవుతున్నారని, వారి శ్రమను సంస్థ కారుచౌకగా దోచుకుంటోందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం బొగ్గుగని కార్మికులతో పాటు ఆర్టిసి కార్మికులు సైతం విధులు బహిష్కరించి 35 రోజులపాటు సమ్మె చేశారని గుర్తు చేశారు. పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం జిల్లాలో సిపిఐ నుండి కొత్తగూడెం నియోజక వర్గానికి ఎంఎల్ఎగా ఉండటం కార్మికుల అదృష్టమని, కార్మిక సమస్యను చట్ట సభల్లో వినిపించే అవకాశం ఉందని, ప్రభుత్వంలో సిపిఐ కూడా భాగమే కావడంతో సమస్యలు పరిష్కరించు కునేందుకు వేదిక దొరికిందన్నారు. అనంతరం నాయకులు బొల్లోజు అయోధ్య, పాకలపాటి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, ఏఐటియూసి రాష్ట్ర కార్యదర్శి శింగు నర్సింహారావు, భద్రాద్రి జిల్లా కార్యదర్శి నరాటి ప్రసాద్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు సరెడ్డి పుల్లారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముత్యాల విశ్వనాధం, బికేఎంయు జిల్లా అధ్యక్షులు రేసు ఎల్లయ్య, గిరిజన సమాఖ్య రాష్ట్ర నాయకులు కల్లూరి వెంకటేశ్వరరావు, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి, శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర నాయకురాలు సిహెచ్ సీతామహాలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.