ఉగ్రరూపమై పరవళ్ళు తొక్కుతున్న గోదావరి
– 43 అడుగులు దాటిన గోదావరి
– ముంపు ప్రాంతాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ఉన్నతాధికారులు
– మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
నేటి గదర్, జూలై 21,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ, 9052354516 :
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి పరవళ్ళు తొక్కుతుంది. భద్రాచలం వద్ద గోదావరి ఇప్పటికే 43 అడుగులు దాటి ఉగ్రరూపం దాల్చింది. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ప్రాజెక్టులన్ని నిండుకుండలను తలపిస్తూ తొణికిసాడుతున్నాయి. ఈ మేరకు ప్రాజెక్టుల నుంచి గేట్లు ఎత్తి వరద నీటిని ఇదిగో ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. దీంతో భద్రాచలం వద్ద గోదావరి గంట గంటకు నీటిమట్టం పెరుగుతూ 43 అడుగుల వద్ద కొనసాగుతుంది. అయితే ఉదయం నుంచి 11 గంటల వరకు గంటకు అంగుళం వరకు పెరిగిన గోదావరి 11 గంటల నుంచి గంట గంటకు అడుగు చొప్పున పెరుగుతూ సాయంత్రం సుమారు 6:30 గంటల సమయానికి 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
– కడెం… కలవరం…
ఎగువ నుంచి వచ్చే ప్రవాహంతో నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులకు గాను ప్రస్తుతం 690.875 అడుగులకు చేరుకుంది. జలాశయానికి ఇన్ఫ్లో 19,686 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 18,227 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు స్వర్ణ జలాశయానికి 6,480 క్యూసెక్కుల వరద ఎగువనుంచి పోటెత్తుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం1,183 అడుగులు ఉండగా ప్రస్తుత 1,176 అడుగులకు నీరు చేరింది.
– జలాశయాలకు పెరుగుతున్న వరద ఉద్ధృతి
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి క్రమంగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. మేడిగడ్డ బ్యారేజీకి 4.06 లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరింది. బ్యారేజీ 85 గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. ఎగువనుంచి వస్తున్న వరద నీటితో జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. భారీగా వరదనీరు చేరడంతో అధికారులు 17 గేట్లు తెరిచారు. జూరాల ప్రాజెక్టు ఇన్ఫ్లో 92 వేల క్యూసెక్కులు ఉండగా, ఔట్ఫ్లో 1.71 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 317.170 మీటర్లకు చేరకుంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.042 టీఎంసీలుగా ఉంది.