నేటి గదర్ న్యూస్ , ఆగస్ట్ 11 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
ఇటీవల కాలంలో కురుస్తున్న వర్షాలకు చెరువులు కుంటల్లోకి వర్షం నీరు చేరుతుంది. అయితే ఆ వర్షపు నీరును చెరువుల్లో కుంటల్లో నిల్వ ఉంచేందుకు గాను చెరువులకు కుంటలకు తూములు ఏర్పాటు చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నీరు చేరుతున్న క్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు తూములకు ఏర్పాటుచేసిన షట్టర్లను నిరంతరం పర్యవేక్షించి ఏమైనా మరమ్మతులు ఉంటే ముందస్తుగానే చేపించాల్సి ఉంది. కానీ ఖమ్మం రూరల్ మండలంలో నీటిపారుదల శాఖ ఏఈ నిర్లక్ష్యంతో ఏ చెరువుకి కూడా తూములకు ఏర్పాటు చేసిన షట్టర్లు సరిగా లేక నీరు వృధాగా పోతుంది. అసలే లేటుగా వర్షాలు అందుకుని చెరువులు నిండు తున్న క్రమంలో వచ్చిన నీరు వచ్చినట్టు వెళ్లిపోతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తల్లంపాడు చెరువుకు ఉన్న తూములన్నీ మరమ్మతులకు గురి కావడంతో వేసవికాలం నుంచి మొరపెట్టుకుంటున్న పెడచెవిన పెట్టిన నీటిపారుదల శాఖ ఏఈ చెరువు దగ్గరకు వచ్చి కనీసం చూసిన పాపాన పోలేదని వాపోతున్నారు. ఈ క్రమంలో గత ఐదు ఆరు రోజుల నుంచి వచ్చిన నీరంతా వెళ్లిపోవడంతో చెరువు నిండాల్సిన నీరంతా వృధాగా పోతుందనీ రైతులు వాపోతున్నారు.