★వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించడం సరికాదు
★ భారీ వర్షాల సమయంలో ప్రజల కష్టాలు చూడలేదా
★ ప్రధాన రహదారి చెరువును తలపించిన విషయం మరిచారా?
★బీజేపీ నాయకులు గడ్డం శ్రీను
ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనేతరులకు మేము వ్యతిరేకం కాదని బీజేపీ చండ్రుగొండ మండల నాయకులు గడ్డం శ్రీను అన్నారు. చండ్రుగొండ మండల కేంద్రంలో సైడ్ డ్రైనేజీ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న దాన్ని దృష్టిలో ఉంచుకొని సహకరించాలని కోరారు. అభివృద్ధికి మేము అడ్డు కాదని, అభివృద్ధిని అడ్డుకునే వారికి వ్యతిరేకమని చెప్పారు. వ్యక్తిగత స్వలాభం కోసం ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించొద్దని సూచించారు. DMFT నిధులతో గత ప్రభుత్వంలో టెండర్ వేయగా ఎన్నికల వల్ల ఆలస్యం అయిందని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో చండ్రుగొండ మండల పరిసర గ్రామాలు జలమయం అయ్యాయని తెలిపారు. దాంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారని వెల్లడించారు. ఈ పరిస్థితిని జిల్లా కలెక్టర్ సందర్శించి ఎలాంటి వివాదం లేకుండా డ్రైనేజీ పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. దాంతో అధికారులు డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టగా వారిని అడ్డుకోవడం సరికాదన్నారు. వ్యక్తిగత స్వలాభం కోసం ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించడం సరికాదని మండిపడ్డారు. కేవలం కొంతమంది పని కట్టుకుని స్వలాభం కోసం నిర్మాణ పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టం చేశారు. అభివృద్ధిని అడ్డుకునే వారికి మేము వ్యతిరేకమని, ఈ ఘటనపై ఈనెల 20.9.2024న జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయబోతున్నామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భూక్య కుమార్ నాయక్, మోహన్ నాయక్, కోడెం నాగేశ్వరరావు, చిన్నం సురేష్ తదితరులు పాల్గొన్నారు.