-.
-భూ సేకరణ అధికారికి వినతిపత్రం అందించిన బిఆర్ఎస్ శ్రేణులు
మణుగూరు మార్చి 13 : మున్సిపాలిటీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో ఓపెన్ కాస్ట్ విస్తరణలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భూసేకరణ ప్రత్యేక అధికారిణి సుమకు భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) మణుగూరు సొసైటీ అధ్యక్షులు బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కుర్రి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందించారు. గురువారం పట్టణంలోని కొమ్ముగూడెం గ్రామంలో ఓపెన్ కాస్ట్ విస్తరణలో భాగంగా ప్రభుత్వ, సింగరేణి అధికారులు పిసా గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ గ్రామసభలో భూ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజి, ఆర్అండ్ఆర్, శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. తిర్లాపురం, రామానుజవరం రెవెన్యూ గ్రామాల భూభాగంలో సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ విస్తరణ చేయడం వలన గిరిజనులు, గిరిజనేతర రైతుల జీవనాధారమైన భూములను కోల్పోతున్నారని తెలిపారు. ఈ భూముల్లో రెండు పంటలు పండే వ్యవసాయ భూములు అధికంగా ఉండడంతో రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. ఓసి విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్నటువంటి గిరిజన గిరిజనేతర రైతులందరికి తగిన ఉపాధి అవకాశాలు, మెరుగైన ప్యాకేజీ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తాళ్లపల్లి యాదగిరి గౌడ్, పదం శ్రీనివాస్, జావిద్ పాషా, జక్కం రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.