తెలంగాణలో అధికారం కోసం జెండాలు అజెండాలను పక్కనపెట్టి అధికార పీఠం కోసం @INCTelangana , @BJP4Telangana ఎంతలా దిగజార్చవచ్చో నేడు నిరూపించాయి అని టిఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ద్వజమెత్తారు.
మార్పు అంటే బీజేపీతో జతకట్టడమేనా? ఇదేనా మీరు తెస్తానన్న మార్పు..
గత 12 ఏండ్లుగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి
బీ-టీమ్ అని కాంగ్రెస్, కాంగ్రెస్ కి బీ-టీమ్ అని బీజేపీ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు అని, ఆ రెండు పార్టీలు తెలంగాణ వ్యతిరేక టీమ్ అని నిరూపించాయి. బీజేపీతో కలిసి సింగిల్ టీమ్ గా మారిపోయింది. ఈ అపవిత్ర కలయిక, ఈ అనైతిక పొత్తు ప్రజలు గుర్తించారు.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం ఈరోజు మున్సిపల్ ఫలితాలతో మరోసారి స్పష్టమైంది. కేవలం బీఆర్ఎస్‌ను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు సిద్ధాంతాలను గాలికొదిలేశాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు ఒకటేనని ఈ మున్సిపల్ ఫలితాలు మరోసారి రుజువు చేశాయి. ఢిల్లీలో కొట్టుకున్నట్టు.. గల్లీలో మాత్రం చేతులు కలుపుతూ వాటాలు వేసుకొని పదవులు పంచుకుంటున్నారు. దీనికి ఆలియాబాద్, మెదక్, నర్సాపూర్, అమన్‌గల్ ఫలితాలే ప్రత్యక్ష సాక్ష్యం.
@revanth_anumula నడిపేది
కాంగ్రెస్ సర్కారా? బీజేపీ సర్కారా?
బీజేపీ-టీడీపీతో కూడిన సంకీర్ణ సర్కారా?
ఆలియాబాద్ నుంచి అమన్‌గల్ దాకా.. మెట్‌పల్లి నుంచి మెదక్ దాకా మీరు సాగిస్తున్న ఈ చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఒంటరిగా బీఆర్ఎస్‌ను ఎదుర్కొనే సత్తా లేదు. అందుకే సిగ్గు వదిలేసి బీజేపీతో కుమ్మక్కైంది. రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ ను నిలువరించి అధికారాన్ని చేపట్టడానికి ఏదో ఒక విధంగా ఫలితాలను తారుమారు చేస్తూ మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాయి..
రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఏమో దేశమంతా బీజేపీ మీద పోరాటం చేస్తే.. ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏమో బీజేపీతో జత కడుతున్నది.
@RahulGandhi గారు.. మీరు ఢిల్లీలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు. దానికి ఈ పొత్తులే సాక్ష్యం.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డిని, బండి సంజయ్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నాను.. మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికకు బీజేపీ పార్టీ కాంగ్రెస్‌తో కలిసింది మీకు తెలియదా? తెలిసే చేశారా? ఢిల్లీలో పెద్దలు కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటారు.. ఇక్కడ మీరేమో కాంగ్రెస్ యుక్త్ బీజేపీ అని నిరూపిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఉన్న బలాన్ని చూసి భయపడే మీరు ఈ కుట్రలకు తెరలేపారు. సింగిల్ గా మా పార్టీని ఎదుర్కొనే దమ్ములేక.. రెండు జాతీయ పార్టీలు ఒక్కటై, బీఆర్ఎస్ మీద దాడి చేస్తున్నాయి. ఇది మా విజయానికి నిదర్శనం కాక మరి ఏమిటి.
బీఆర్ఎస్ అత్యధిక వార్డులు గెలుచుకున్న చోట్ల కూడా కుట్రలు చేసి పదవులు దక్కించుకున్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కాంగ్రెస్ తీసుకుని, వైస్ చైర్మన్ పదవి బీజేపీకి ఇచ్చారంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం మరొకటి ఉంటుందా?
ఒక పక్క నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటారు. మరోపక్క ఉత్తర తెలంగాణలో బీజేపీతో జతకడతారు. ఇదేనా ప్రజా పాలన.
సిర్పూర్ కాగజ్‌నగర్‌లో, మెట్‌పల్లిలో కూడా ఇదే తంతు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను బీజేపీ కాంగ్రెస్ పంచుకోవడం రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా గమనిస్తున్నారు.
నర్సాపూర్ లో కాంగ్రెస్ చైర్మన్ – బీజేపీ వైస్ చైర్మన్.
సిర్పూర్ కాగజ్‌నగర్ లో బీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ (11 సీట్లు) ఉన్నా.. కాంగ్రెస్, బీజేపీలు కలిసి అధికార పీఠాన్ని హైజాక్ చేశాయి.
అలియాబాద్ లో బీజేపీకి ఉన్న 3 సీట్ల మద్దతుతో కాంగ్రెస్ చైర్మన్ సీటు దక్కించుకుంది.
మెట్‌పల్లిలో విచిత్రం ఏంటంటే.. బీజేపీకి అధికారం దక్కేలా కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది.
అమన్ గల్.. ఇక్కడ కూడా బీజేపీ, కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం నడిచింది.
కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధాన్ని చూడలేక కొన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో ఓటింగ్ కి దూరంగా ఉన్నాం.
మరొకవైపు.. క్యాతనపల్లి, తొర్రూరు, జనగామ, జహీరాబాద్ లాంటి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు మెజారిటీ సీట్లు కట్టబెట్టినప్పటికీ.. అక్కడ ప్రజా తీర్పును గౌరవించకుండా అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని చైర్మన్ పీఠాలను హైజాక్ చేయాలని చూస్తున్నారు. కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ, అధికారులను పావులుగా వాడుకుంటూ.. ఎలాగైనా సరే అందలం ఎక్కాలని కాంగ్రెస్, బీజేపీలు కుటిల రాజకీయాలకు తెరలేపాయి.
బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టడానికి సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చారు. కాంగ్రెస్ ముసుగులో బీజేపీ, బీజేపీ ముసుగులో కాంగ్రెస్ పనిచేస్తున్నాయి. ఈ అపవిత్ర కలయికను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటున్నది. రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్తారు.








