– నోటీసులు ఇవ్వకుండా ఇండ్లను కూల్చడం సరైనది కాదు…
– బాధితులకు తక్షణమే పునరావాసం కల్పించి, తగిన న్యాయం చేయాలి..
– ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ ప్రాంతాన్ని సందర్శించిన ప్రొఫెసర్ కోదండరాం గారు..
ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ ఇండ్ల నిర్వాసితులను కలిసి వారి సమస్యలను తెలుసుకుని, నగరంలో ఏర్పాటు చేసిన శిబిరాల్లో బాధితులను పరామర్శించారు. అనంతరం వెలుగుమట్ల ప్రాంతాన్ని సందర్శించి, అక్కడి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నోటీసులు ఇవ్వకుండా ఇండ్లను కూల్చడం సరైనది కాదని అభిప్రాయపడుతూ, బాధితులకు తక్షణమే పునరావాసం కల్పించి తగిన న్యాయం చేయాలని కోరారు. ఇటీవల వెలుగుమట్ల భూదాన్ భూములపై సుమారు 600 ఇండ్లను అధికారులు కూల్చివేయడంతో అనేక కుటుంబాలు నివాసం లేకుండా పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ చర్యపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండగా, ప్రభుత్వం భూమి వివాదాల పేరుతో చర్యలు చేపట్టినట్లు చెబుతున్నా, పేదలపై దాని ప్రభావం తీవ్రంగా పడిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ముందస్తుగా నోటీసులు ఇచ్చి కొంత సమయం ఇవ్వాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు. అక్కడ నివసిస్తున్న వారంతా పేద ప్రజలే అని, ఖమ్మం నగరంలోనే పనిచేస్తూ జీవనాధారం పొందుతున్నారని తెలిపారు. కావున వారికి ఖమ్మం నగరంలోనే ప్రత్యామ్నాయ వసతి సౌకర్యం కల్పించాలని కోరారు. ఇక్కడ పరిశీలించి, స్థానికులతో మాట్లాడిన అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్, జిల్లా నాయకులు సర్దార్, రవి, షేక్ నబీ, కరుణాకర్, జేఏసీ నాయకులు రంగ రాజు, భాస్కర్ రావు, తదితరులు పాల్గొన్నారు.








