*ఆదివాసీలను ఆధారాలు అడిగితే చట్ట రీత్యా నేరం
*ఏ ఎన్ ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కోర్స నర్సింహమూర్తి
నేటి గదర్ న్యూస్ ,వాజేడు(వెంకటాపురం):ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని చూస్తున్న గిరిజనేతరుల పైన అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏ ఎన్ ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కోర్స నర్సింహమూర్తి డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన వెంకటాపురం మండల కేంద్రం లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఏజెన్సీ లో 1/70 చట్టాన్ని యదేచ్చగా ఉల్లంఘిస్తూ గిరిజనేతరులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నాయకుల గూడెం గ్రామానికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో గిరిజనులు, ఆదివాసీలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని,వారికి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని యూడిసి ఎంజ సమ్మయ్యకు నర్సింహ మూర్తి ఆదివాసీల తో కలిసి సోమవారం మెమొరాండం ఇచ్చారు. 5వ షెడ్యూల్డ్ భూభాగం లో ప్రతి సెంట్ ప్రభుత్వ భూమి ఆదివాసీలకు చెందుతుందని 1/70 చట్టం చెప్తోందనీ రెవెన్యూ అధికారికి తెలియజేశారు.భూమికి సంబంధించిన కాగితాలు చూపె ట్టాలనీ ఆదివాసీలను అధికారులు అడిగి బెదిరింపు చర్యలకు పాల్పడటం నేరం అవుతుందని అన్నారు. గిరిజ నేతరులను మాత్రమే ఆధారాలు అడగాలని చట్టం చెప్తున్నట్లు ఆయన రెవెన్యూ అధికారులకు సూచించారు. ఎన్నో ఏళ్లుగా నాయకుల గూడెం గిరిజనులు ఇంటి స్థలాలు లేక ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి అన్నారు. వారికి ఇంటి స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని మెమొరాండం లో తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1/70 చట్టం అమల్లో ఉన్నప్పటికీ నేటికీ ప్రభుత్వ భూములను గిరిజనేతరులు కబ్జా చేస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు అని విమర్శలు గుప్పించారు . సంబంధం లేని గిరిజనేతరులు తమ భూమి అని నివాసాలు ఖాళీ చేయాలని బెదిరింపు చర్యలకు పాల్పడటం పైన ఆయన మండిపడ్డారు. రెవెన్యూ రికార్డ్ ల ప్రకారం వెంకటాపురం జీ సర్వే నంబర్54,55, 56 లోని భూమి ప్రభుత్వ భూమి గా ఉన్నదని అన్నారు. కానీ కొంతమంది అక్రమార్కులు తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోంది అని అన్నారు. రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు అండగా నిలబడితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. నాయకుల గూడెం ఆదివాసీల పక్షాన ఏ ఒక్క రాజకీయ పార్టీ నిలడక పోయిన ఆదివాసీ నవనిర్మాణ సేన ఖచ్చితంగా అండగా నిలబడుతుంది అన్నారు. సర్వే నంబర్ 54,55, 56 లోని ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేయకుండ చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులకు ఉన్నదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో మండల ప్రధాన కార్యదర్శి కుంజ మహేష్, ఉమ్మడి యేసు, రాంబాబు ఆదివాసీలు పాల్గొన్నారు.









