జూలూరుపాడు, నేటి గదర్ ప్రతినిధి, మండల పరిధిలో ఇంటి స్థలం లేని అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ భూమిని తక్షణమే పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని పడమట నర్సాపురం రెవెన్యూ పరిధిలో గల 162 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి యాస నరేష్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ నర్సాపురం గ్రామంలోని 162 సర్వేనెంబర్ లో గిరిజనేతరుల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని అధికారులు వెంటనే స్వాధీనం చేసుకొని మండల వ్యాప్తంగా ఉన్న ఇండ్ల స్థలాలు లేని అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలం కేటాయించాలని కోరారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని అనేక మార్లు ప్రభుత్వ ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్న నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములను గిరిజనేతరులు సాగు చేయకుండా కౌలు, ఇతర మార్గాల ద్వారా లక్షలు గడిస్తున్నారని తెలిపారు. ఇప్పటి కైనా అట్టి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని ఇంటి స్థలం లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని, లేని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అట్టి భూములలో గుడిసెలు వేయించి ఇండ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు భానోత్ ఈశ్వర్, లాకావత్ శ్రీను, పార్టీ శాఖ కార్యదర్శి బానోత్ రూప, అభిమిత్ర, పార్టీ సీనియర్ నాయకులు బొల్లి లక్ష్మయ్య, నాగేశ్వరరావు, భూక్య బిచ్చు తదితరులు పాల్గొన్నారు.