సేకరణ:రణధీర్✍️
నేటి గదర్ వెబ్ డెస్క్:
సాహితి వాళ్ళింట్లో సందడిగా ఉంది.
సాహితి కజిన్ { పిన్ని కూతురు } స్వప్న తన కుటుంబంతో ఆ రోజు సాహితి వాళ్ళింటికి వచ్చింది .
ఎప్పుడో కానీ రాని అక్క స్వప్న ఇంటికి రావడంతో సాహితి ఆనందానికి అవధులు లేవు . లంచ్ కోసం మూడు నాలుగు డిషెస్ చేసింది . ఇంకొన్నిటిని జొమాటో పై ఆర్డర్ ఇచ్చి తెప్పించింది .
భోజనాల సమయం లోస్వప్న భర్త అంటే తన బావ గారు ” పిల్లల చదువెలా సాగుతోంది స్వప్న ? ” అని అడిగారు .
“బాగుంది బావగారు . మేము చాలా హ్యాపీ . పిల్లలు ఇద్దరు ఇష్టపడి స్కూల్ కు వెళుతారు . స్కూల్ లో టీచర్ లు పిల్లలకు అర్థమయ్యేలా పాఠాన్ని చెబుతారు . కష్టపడి కాకుండా.. మా ఇద్దరు పిల్లలు.. ఇష్టపడి చదువుతారు . జంక్ ఫుడ్ కు.. సెల్ ఫోన్ దూరంగా వుంటారు . ఆటల్లో పాటల్లో చురుకుగా పాల్గొంటారు ” చెప్పింది సాహితి .
” ఇంత అమాయకంగా ఉంటే ఎలా సాహితి ? ట్రెండ్ బట్టి పోవాలి కానీ ?… ఇంకా నువ్వు సంపూరణాత్మక విద్య .. క్రీడలు… అని కూర్చుంటే పిల్లలు వెనుకబడి పోరా ? పోనీ ఏదో ఐదో క్లాస్ వరకు అయితే ఫరవా లేదు . పిల్లలిద్దరూ ఇప్పుడు హై స్కూల్ కొచ్చారు . ఆరో తరగతి నుంచే ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ చదివించకపోతే వెనుకబడిపోతారు . మా ఇద్దరు పిల్లల్ని చూడు . చిన్నది ఆరో తరగతి . ఇప్పుడు దానికి ఎనిమిదో క్లాస్ గణితం, ఫిజిక్స్ పాఠాలు నడుస్తున్నాయి . పెద్దాడు ఎనిమిదో తరగతి . ఇప్పుడు వాడికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లెసన్స్ నడుస్తున్నాయి . ఖో ఖో…. కబడ్డీ అంటూ మీ పిల్లలు పదో తరగతి దాకా కాలక్షేపం చేసి ఇంటర్ కొస్తే అప్పడు ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ చేసిన మా పిల్లలు లాంటివారితో పోలిస్తే బాగా వెనుకబడి పోరా ? ఐఐటీ లో సీట్ వస్తే లైఫ్ సెటిల్ అయిన్నట్టే . లైఫ్ స్కిల్స్ లాంటివి నేర్చుకోవడానికి అటుపై బోలెడంత లైఫ్ ఉంటుంది… ” స్వప్న చెబుతుంటే సాహితి ఆమె భర్త శ్రీనివాస్ ఆలోచనలో బడ్డారు .
” ఈ రోజు మీరు ఇంటికి రాకుంటే మేము లైఫ్ లో ఎంత మిస్ అయ్యే వాళ్ళమో స్వప్న” .. చెప్పింది సాహితి .
మరుసటి రోజే శ్రీనివాస్ , సాహితి ఇద్దరూ తమ పిల్లలని తీసుకొని స్వప్న తో కలిసి ఆమె పిల్లలు చదువుతున్న కార్పొరేట్ స్కూల్ కు కు వెళ్లారు . ఏవో టెస్ట్ లు పెట్టి .. “మీ పిల్లలు అకాడెమిక్స్ లో బాగా వీక్ గా వున్నారు . కనీసం ఇప్పటికైనా మేలుకున్నారు . ఏదో మా స్కూల్ పేరెంట్ అయిన స్వప్న గారు రికమెండ్ చేసారు కాబట్టి సీట్ ఇస్తున్నాము ” అన్నారు .
సాహితి శ్రీనివాస్ ల ఆనందానికి అవధులు లేవు . తమ పిల్లలు ఖరగ్పూర్ ముంబై ఐఐటీ ల చదువుతున్న దృశ్యం వారి కళ్ళముందు కదలాడింది .
వారం రోజులు గడిచాయో లేదో … సాహితి పిల్లలిద్దరూ “కొత్త స్కూల్ కు వెళ్లము” అని మొండికేశారు .
” మా ఇంగ్లీష్ టీచర్ కే ఇంగ్లీష్ సరిగ్గా రాదు . “మ్యాడం” .. “కమ్ము” .. “వ్వాట్ దీసు” అని బట్లర్ ఇంగ్లీష్ లో మాట్లాడుంటే నాకొచ్చిన ఇంగ్లీష్ పోతుందేమో అని భయం వేస్తోంది ” చెప్పింది చిన్నది .
” ఇంగ్లీష్ దేముందమ్మా ? మాథ్స్ , ఫీజికల్ సైన్స్ ముఖ్యం . అదే మిమ్మల్ని రేపు ఐఐటీ క్యాంపస్ లోకి తీసుకొని వెళ్ళేది ” చెప్పింది సాహితి .
” లేదు మమ్మీ .. మా టీచర్స్ కు సబ్జక్ట్స్ సరిగ్గా రాదు అనిపిస్తుంది . పుస్తకం లో ఉన్నది ఉన్నట్టుగా చెబుతారు . ఎనాలిసిస్ ఉండదు , వివరణ అసలు ఉండదు . ఏదైనా డౌట్ అడిగితే ” అతి తెలివి చూపించకు . నోరు మూసుకొని కూర్చో . ఒకటికి నాలుగు సార్లు చదువు .. సబ్జెక్టు అదే వస్తుంది ” అని తిడుతారు . మా క్లాస్ అంతా బట్టి చదువులే . పుస్తకంలో ఉన్నదాన్ని ఉన్నట్టు చదివి పరీక్ష లో రాయడమే . పరీక్షలకు ముందే మాకు ప్రశ్నలు స్లో గా లీక్ చేస్తారు . వాటినే వల్లే వేయించి పదేపదే రాయిస్తారు . దానితో పాఠం ఒక ముక్క అర్థం కాకపోయినా చాలా మందికి నూటికి నూరు మార్కులు వచ్చేస్తాయి .. ఈ వారం రోజుల్లో నాకు అర్థం అయ్యింది మా సీనియర్స్ తో మాట్లాడితే వారు చెప్పింది ఇదే ” ఎనిమిదో తరగతి లోని పెద్దాడు చెబుతూ పోతుంటే సాహితి అంతర్మధనం లో పడిపోయింది .
మరుసటి రోజు భర్త తో కలిసి స్కూల్ ప్రిన్సిపాల్ ను కలిసింది . అయన ఛాంబర్ లో అదే సమయానికి ఆ ఏరియా డీన్ కూడా వున్నారు .
” మీరు ఐఐటీ బ్యాచ్ లో చేర్పించారు . ఇంకా మంచి స్టేట్ లెవెల్ ఫాకల్టీ కావాలంటే ఫీజు రెండు లక్షలు . సీఓ బ్యాచ్ లో అయితే బెస్ట్ ఫాకల్టీ ఉంటుంది . స్టడీ హవర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ” ప్రిన్సిపాల్ చెప్పారు .
” ఆంత ఫీజు కట్టుకోలేము సార్!” చెప్పింది సాహితి .
” అయితే మీకు సాయం చేస్తాము . మీరు గనుక ఒక కొత్త అడ్మిషన్ తెస్తే మీ పిల్లల ఫీజు లో కొంత రాయితీ ఉంటుంది . ఎన్ని అడ్మషన్స్ తెస్తే ఆంత కన్సెషన్ . పది అడ్మషన్స్ తెస్తే ఫ్రీ కోచింగ్ . ఈ స్కీం అందరికీ కాదు . మీకు ఒక్కరికి మాత్రమే ” చెప్పారు డీన్ .
” మేము అడ్మషన్స్ ఎలా తేవాలి సార్?” అడిగారు సాహితి దంపతులు.
” ఏముందండి ? చాలా సింపుల్ .. మీ బంధువుల స్నేహితుల ఇళ్లకు చుట్టపు చూపుగా వెళ్ళండి . వారికి మన ఐఐటీ కోర్స్ గురించి చెప్పండి . కన్విన్స్ చెయ్యండి . మీ రెఫరెన్సు తో వారు అడ్మిషన్ తీసుకొంటే మీ పిల్లకు ఫీజు లో రాయితీ ” చెప్పాడు ప్రిన్సిపాల్ .
స్కూల్ బయటకు వచ్చాక ..
” ఏమండి ..నేనంత పిచ్చిదాన్నో ! మనింటికి ఆ రోజు స్వప్న వచ్చిందంటే తెగ సంతోషపడిపోయాను .తెల్లవారు జామున లేచి వంటలు చేశాను . ప్లాన్డ్ గా స్కూల్ మార్కెటింగ్ కోసం .. అదీ తన పిల్లల ఫీజు కన్సెషన్ కోసం మనకు బ్రెయిన్ వాష్ చేస్తుందని అనుకోలేదు . ఇంత మోసమా ? ” భర్త తో అంది సాహితి .
” ఈ రోజుల్లో అందరూ ఇంతే సాహితి .. . మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా కార్పొరేట్ స్కూల్ మార్కెటింగ్ మాయాజాలం” చెప్పాడు శ్రీనివాస్ .
” లేదండీ అందరూ ఇలా కాదు . మా కిట్టి పార్టీ లో చాలా మంది మార్వాడి ఫ్రెండ్స్ వున్నారు . వాళ్ళ వ్యాపారం లో వారు ఏమి చేస్తారో నాకు తెలియదు కానీ .. బంధువుల మిత్రుల విషయం లో వారు ఇలా తప్పుడు సలహాలివ్వరు . బంధుత్వం విలువ వారికి తెలిసినంతగా బహుశా మరెవరికీ తెలియదేమో ” చెప్పింది సాహితి .
” అవును సాహితి . ఒక కాకి ఛస్తే కాకులన్నీ ఒక్క చోట చేరి గోల చేస్తాయి . చంపిన వాడిని వెంటాడి వేధిస్తాయి . అదే జంతు ప్రపంచం లో పీత లు కూడా ఉన్నాయి. ఒకటి పైకి పోతుంటే మిగతావి దాన్ని కిందకు లాగేస్తాయి . మనుషులంతా ఒకే రకంగా ఉండరు. స్వలాభం కోసం బంధుత్వాలను అమ్ముకొనే వారు ఎందరో ? మన జాగ్రత లో మనం ఉండాలి . రకరకాల మోసాలు .. రకరకాల మార్కెటింగ్ టెక్నీక్కులు .. వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపఁతగున్ .. కని కల్లా నిజమే తెలిసినవాడే మనుజుడు మహిలో సుమతి ” అపార్ట్మెంట్ లో కార్ పార్క్ చేసూ శ్రీనివాస్ చెప్పిన మాటలు .
క్రెడిట్స్: అమర్నాథ్ వాసిరెడ్డి