నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(ఖమ్మం):
రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) పండుగను గురువారం జరుపుకోనున్న సందర్భంగా ఉభయ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ముస్లింలందరికీ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజులు ఎంతో నిష్ఠ తో ఉపవాసాలు(రోజా) ఉండి.. ఆకలిదప్పుల విలువ తెలుసుకొని.. పవిత్రంగా జరుపుకునే ఈద్ ఇదని పేర్కొన్నారు. సహనం, త్యాగం, జాలి, దయ, సేవాగుణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలనే దృఢ సంకల్పంతో..పిల్లలు, యువతకు దిశా నిర్దేశం చేసిన మాసం ఇదని తెలిపారు. మహమ్మద్ ప్రవక్త (స) ఆదేశానుసారం.. అనాది నుంచి నేటి వరకు ఫిత్రా పేరిట ఆహారం, వస్త్రాలు, నగదు రూపంలో పేదలకు సాయం చేస్తూ వస్తోన్న సంప్రదాయం ఎంతో గొప్పదని మంత్రి పొంగులేటి అభివర్ణించారు. అంతటా ఈద్గాలు, మసీదులలో ప్రత్యేక ప్రార్థనల నడుమ రంజాన్ పండుగను సంబరంగా జరుపుకోవాలని, ఈద్ ముబారక్ ఆత్మీయ శుభాకాంక్షలతో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.