పంటలు ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం తక్షణమే చెల్లించాలి
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు.. కొర్స నర్సింహా మూర్తి
ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్ట్ నీళ్లు వృధా అయ్యాయి
నేటి గద్దర్ న్యూస్, వెంకటాపురం :
పాలెం వాగు ప్రాజెక్ట్ ను నమ్ముకొని రైతులు వేసిన వందలాది ఎకరాల వరి పంటలతో పాటు, మిర్చి, మొక్కజొన్న పంటలు కూడా ఎండి పోయాయి అని ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహామూర్తి తెలియజేసారు. శనివారం అయన రైతుల తో పాటు బర్లగూడెం పంచాయతీ లోని వరి పంటలను పరిశీలించుట జరిగింది. పాలెం వాగు ప్రాజెక్ట్ నీళ్లు రాకపోవడం కారణంగానే చేతికొచ్చిన వరి పంటలు ఎండి పోయినట్లు రైతులు నర్సింహా మూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రక్కనే ప్రవహిస్తున్న గోదావరి నదీ జలాలు ఈ ప్రాంత రైతాంగానికి చుక్క నీరు కూడా ఉపయోగపడటం లేదన్నారు. ఈ ప్రాంత గోదావరి జలాలను పక్క రాష్ట్రాలకు తరలిస్తూ ఈ ప్రాంత రైతాంగానికి పాలకులు తీవ్ర నష్టం చేస్తున్నారని అయన ఆరోపించారు. ఈ ప్రాంత రైతుల కోసం ఏర్పాటు చేసిన పాలెం వాగు ప్రాజెక్ట్ కూడా నిరూపయోగం గా మారిందన్నారు . సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు ప్రాజెక్ట్ నీళ్లను ఆదా చేయకుండా వేల క్యూ సెక్కుల నీళ్లు గోదావరిలో వృధాగా వదిలేశారని ఆయన ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా యాసంగి లో వేసిన రైతుల పంటలు ఎండి పోయి తీవ్రంగా నష్ట పోయారని తెలిపారు. సంబంధిత ప్రాజెక్ట్ అధికారులు అందుబాటులో ఉండడం లేదన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి దశాబ్ద కాలం దాటుతున్న ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం పనులు కాలేదని అన్నారు. పదేళ్లు పాలించిన బారాసా పార్టీ ప్రాజెక్ట్ ని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. అలాగే నూతనంగా ఎన్నుకోబడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించు కోకపోవడం అన్యాయం అన్నారు. ఈ ప్రాంత అధికార, ప్రతిపక్ష పార్టీలు పాలెం వాగు ప్రాజెక్ట్ పైన ఎందుకు మాట్లాడడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన యాసంగి పంటలు కళ్ళ ముందే ఎండి పోవడం తో రైతులు కన్నీటి పర్యంతం అయినట్లు ఆయన తెలిపారు. యాసంగి లో వరి పంటలు ఎండిపోయిన రైతులను ప్రజా ప్రభుత్వం ఆదుకోవాలని, రైతులకు ఎకరానికి యాభై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని నర్సింహా మూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అలాగే యాసంగిలో వరి పంటలు ఎండిపోయిన రైతుల బ్యాంకు రుణాలను కూడా మాఫీ చేయాలనీ ప్రభుత్వాన్ని కోరినారు.ఈ కార్యక్రమం లో రైతులు ఇర్ప బాబు, అట్టం శివ, చేలే బాలకృష్ణ, తదితరులు ఉన్నారు.