నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 22, భద్రాద్రి కొత్తగూడెం :
భారీ స్థాయిలో గంజాయి పట్టుబడిన సంఘటన సోమవారం భద్రాచలంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం కూనవరం చెక్‌పోస్ట్ వద్ద ఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం టౌన్ ఎస్ఐ విజయలక్ష్మి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన వాహనాన్ని ప్రత్యేకంగా తనిఖీ చేశారు. కాగా ఆ వాహనంలో సుమారు 21 కేజీల గంజాయి లభ్యమైంది. ఆ గంజాయిని సీజ్ చేసి, తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలిసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు తిరువూరుకు చెందిన కొలికపోగు చందు, మద్దిరాల జయదేవ్ మానిక్‌గా గుర్తించినట్లు సమాచారం. వీరిద్దరు జల్సాలకు అలవాటు పడి, సులువుగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో గంజాయి తరలింపులకు పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి నిషేధిత మత్తు పదార్థాలను అక్రమ రవాణా, అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.









