– దిగివచ్చిన ఏపీ పేపర్ మిల్ యాజమాన్యం
– నేటి నుంచి యదావిధిగా కార్యకలాపాలు
– జిల్లా కలెక్టర్ చొరవతో ఫలించిన చర్చలు
నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 26,
ఎపి పేపరు మిల్లు లాకౌట్‌ను ఎత్తివేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు గురువారం నోటీసు బోర్డు ఏర్పాటు చేసింది. ఎ షిప్టు నుంచి అనగా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి యథావిధిగా కార్మికులు విధులకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొంది. జిల్లా కలెక్టరు కె. మాధవీలత అధ్యక్షతన జిల్లా ఎస్‌పి, జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సమక్షంలో యాజమాన్యం, మిల్లులోని మొత్తం 11 కార్మిక సంఘాలతో కలెక్టర్ కార్యాలయంలో గురువారం చర్చలు జరిగాయి. సుమారు 2 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో కార్మిక సంఘాలు అనేక సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. యాజమాన్యంతో జరిపిన చర్చలలో ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయి. కార్మికులు విధులకు హాజరైన 25 రోజులలో వేతన ఒప్పందం చర్చలు చేస్తామని యాజమాన్యం ఒప్పుకుంది. అదే విధంగా ఎపి పేపర్ మిల్లు యాజమాన్యం చివరి సారిగా 2017లో కార్మికులతో చేసిన వేతన ఒప్పందం చేసుకోగా ఈ ఒప్పంద కాలం 2020 జూన్‌తో ముగిసింది. గతంలో జరిగిన చర్చలలో 2020`2023 మధ్య కాలానికి వేతన ఒప్పందం చేయబోమంటూ మొండికేసిన యాజమాన్యం ఎట్టకేలకు దిగొచ్చింది. జిల్లా కలెక్టర్ సమక్షంలో 2020౼2023 కాలానికి రాత పూర్వక హామీ ఇచ్చింది.సమ్మె కాలంలో కార్మికులపై ఎలాంటి కక్ష పూరిత చర్యలు చేపట్టబోమని పేర్కొంది.
ఇది కార్మికుల విజయం: సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి. అరుణ్
వేతన ఒప్పందం కోసం కార్మిక సంఘాలు ఐక్యంగా చేసిన పోరాటం ఫలించింది. గత 23 రోజులుగా కార్మికులు ఐక్యంగా సమ్మె చేపట్టారు. ఇది కార్మికుల విజయం. 2020`2023 మధ్య కాలంలోని వేతన ఒప్పందం చేసేందుకు యాజమాన్యం రాతపూర్వక హామి ఇచ్చింది. కార్మికులకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు.
యాజమాన్యం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కార్మిక పోరాటం తప్పదని పేర్కొన్నారు.