నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(అశ్వాపురం)
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థులకు పాఠశాల ప్రారంభించే నాటికి మైనర్ రిపేర్లు, ప్యాచ్ వర్క్, డ్యూయల్ డెస్క్ బల్లలు రిపేరు చేయించి పూర్తిస్థాయిలో విద్యార్థులకు పనికి వచ్చే విధంగా స్పెషలాఫీసర్లు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అన్నారు.
శనివారం నాడు అశ్వాపురం మండలం గొందిగూడెం ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలోని టాయిలెట్లు వాష్ రూములు డార్మెటరీ తరగతి గదులను ఆయన పరిశీలించారు. ఆశ్రమ పాఠశాలకు సెలవులు ఇచ్చినప్పటినుండి పాఠశాలను, తరగతి గదులను శుభ్రం చేయకుండా ఉండడంతో సంబంధిత హెచ్ఎం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతిరోజు పాఠశాలలను శుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు. ప్రస్తుతం పాఠశాలలకు వేసవి సెలవులు ఉన్నందున తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పాఠశాలకు సంబంధించిన ప్యాచ్ వర్కులు ,మైనర్ రిపేర్లు, మరియు ప్రతి తరగతి గదిలో, డైనింగ్ హాలులో ,డార్మెటరీలలో, గాలి వెలుతురు సక్రమంగా వచ్చేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఆశ్రమ పాఠశాలలో వెంటి లెటర్స్ కి క్రిమి కీటకాలు రాకుండా మెస్ వేయించాలని, డార్మెటరీ తరగతి గదులకు ఆల్ఫాబెట్ల ప్రకారం నంబర్లు వేయాలని, విద్యార్థిని విద్యార్థులు పడుకునే రూములలో నాలుగు బెడ్లకు కలిపి ఒక ఫ్యాన్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ వేరుగా ఉండాలని, పాఠశాలలకు సంబంధించి మైనర్ రిపేర్లు మరియు ట్యూబ్ లైట్లు ఫ్యాన్లు అమర్చే పనులు ఈనెల 15వ తేదీ నుండి ప్రారంభించి 20వ తేదీ నాటికి అన్ని పనులు పూర్తి కావాలని అన్నారు. విద్యార్థులు కింద పడుకోకుండా డబుల్ కాట్ మంచాలు కట్ చేయించి ప్రతి విద్యార్థి మంచాల మీదే పడుకునేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. డ్యూయల్ డిస్క్ బల్లలు పాడైపోతే వెంటనే రిపేరు చేయాలని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు టాయిలెట్లు, వాష్ రూములలలో అపరిశుభ్ర లేకుండా శుభ్రంగా ఉండేలా ఏర్పాటు చేయాలని, ఫ్లోరింగ్ పగళ్ళు తేలి ఉండడంతో తప్పనిసరిగా ప్యాచ్ వర్క్ చేయించాలని అలాగే టాయిలెట్ వాష్ రూమ్లలో యాసిడ్ తో శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, పాఠశాల ఆవరణలో చెత్తాచెదారం ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, డ్రైనేజీలలో మురికి నీరు నిల్వ ఉండకుండా చూడాలని అన్నారు.
పాఠశాలలో తెరిచే నాటికి విద్యార్థులు రాగానే వారు ఇంటిని మర్చి పోయేలా మంచి వసతి సౌకర్యాలు కల్పించి వారి విద్యకు ఆటంకం కలగ కుండా చర్యలు చేపట్టాలని అన్నారు. మరల ఆకస్మిక తనిఖీకి వచ్చేనాటికి ఆశ్రమ పాఠశాలల్లో అన్ని రకాల పనులు పూర్తి కావాలని, లేనియెడల సంబంధిత సిబ్బందిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు.అనంతరం పాఠశాలలోని వంట గదులు, డబుల్ కాట్ మంచాలు, మరియు గోడలకు జరుగుతున్న ప్యాచ్ వర్క్ లను ఆయన పరిశీలించారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్/డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ శ్రీనివాస్ , ఏడి అగ్రికల్చర్ భాస్కరన్ , మరియు గొందిగూడెం ఆశ్రమ పాఠశాల హెచ్ఎం రామారావు తదితరులు పాల్గొన్నారు.
