నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా
– నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు
– జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
నేటి గదర్, మే 21, భద్రాద్రి కొత్తగూడెం :
రైతులు నకిలీ విత్తనాల ముఠాల బారిన పడకుండా జిల్లా వ్యాప్తంగా వ్యవసాయాధికారులతో కలిసి సమన్వయం పాటిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని విత్తన దుకాణాలలో తనిఖీలు చేపట్టే విధంగా పోలీసు అధికారులకు ఆదేశాలను జారీ చేయడం జరిగిందని తెలియజేశారు. రైతులకు మేలు రకం విత్తనాలు విక్రయించే విధంగా నమ్మిస్తూ నకిలీ, కల్తీ విత్తనాలను సరఫరా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా అధికారులు అప్రమత్తతో సమాచారాన్ని సేకరించి కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. వానాకాలం సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్న సమయంలో నకిలీ విత్తనాలను విక్రయించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వారిని అరికట్టడంలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని విత్తనాలు దుకాణాల యజమానులకు పలు సూచనలు చేయడం జరుగుతుందని తెలిపారు. నకిలీ విత్తనాలను సరఫరా చేసే వారిని గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, సమాచారం సేకరించి నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠినంగా చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. లైసెన్స్ లు లేకుండా దుకాణాలను నడిపినా, రికార్థులను సరైన పద్దతిలో మెయింటైన్ చేయకపోయినా, నకిలీ విత్తనాలను విక్రయించినా యజమానులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఆదేశాల జారీ చేయడం జరిగిందని తెలియజేసారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థల నుంచి విత్తనాలను వినియోగించేలా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రైతులకు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. నకిలీ విత్తనాలు ఇతర ప్రాంతాల నుండి జిల్లాకు రవాణా కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అక్రమ రవాణాను జరిగే ప్రాంతాలు, మార్గాలను గుర్తించి ఆకస్మిక తనిఖీలు చేయడం, మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతోపాటు నకిలీ, కల్తీ విత్తనాల అక్రమ రవాణాను, సరఫరాను అరికట్టడం జరిగుతుందని తెలిపారు.