నేటి గద్ధర్ న్యూస్,ములుగు:
ఈ నెల 27 తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు
సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారిని, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారిని, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారిని మాట్లాడుతూ వరంగల్ -ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మే27వ తేదీ ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, జూన్ 5వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. పట్టభద్రుల ఉపఎన్నికలో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు.
సాధారణ ఎన్నికల మాదిరి మాక్ పోలింగ్ ఉండదని, పోలింగ్ ఎజెంట్ల సమక్షంలో పోలింగ్ బాక్స్ ఓపెన్ చేసి చూపడం జరుగుతుందని, బాక్స్ మొత్తం ఖాళీగా ఉండాలని తెలిపారు. ఆ సమయంలో విడియో గ్రఫి చేసి తదుపరి పోలింగ్ బాక్సుని క్లోజ్ చేసి సీల్ వేయాలని, తర్వాత పోలింగ్ ను ప్రారంభించాలని అన్నారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు కులం మతం ప్రాంతంపై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని ఓటర్లను ప్రలోభాలకు బెదిరింపులకు గురి చేయడం తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన శిక్షలు విధించడం జరుగుతుందని తెలిపారు.
జిల్లా పరిధిలో 17 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 10,299 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారని ఇందులో పురుష ఓటర్లు 6,587 మంది ఉండగా, మహిళా ఓటర్లు 3712 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు.
పట్టభద్రుల ఉప ఎన్నికలకు విధులు కేటాయించిన సిబ్బందికి ఓటు హక్కు వినియోగానికి ఫారం 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో ఈ నెల 22వ తేదీన ఓటు హక్కు వినియోగించు కోవాలని తెలిపారు. 22వ తేదీన ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగానికి సమయం కేటాయించామని ఆమె అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో పోలింగ్ మెటీరియల్ పంపిణీ, రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 26వ తేదీన మెటీరియల్ ఇవ్వడం జరుగుతుందని, అదే రోజు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని మరుసటి రోజు పోలింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. వయోవృద్ధులు,
దివ్యాన్గుల సహాయార్థం పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్లు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశం లో ఆర్డీఓ కే. సత్యా పాల్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సెక్షన్ సూపర్ ఇండెంట్, డి టి, తదితరులు పాల్గోన్నారు.