టిమ్స్ ఆస్పత్రి పై మంత్రి మాటలు దురదృష్టకరం:మాజీ మంత్రి హరీష్ రావు
నేటి గద్ధర్ న్యూస్ వెబ్ డెస్క్:
తెలంగాణ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని గత కేసీఆర్ ప్రభుత్వం టిమ్స్ కి బాటలు వేస్తే.. నేడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే టీమ్స్ పై విషం చిమ్మడం బాధాకరమని బి ఆర్ ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. తన ఎక్స్ (X)అకౌంట్ వేదికగా మంత్రి మాటలపై స్పందించారు .
బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి విషం చిమ్మడం బాధాకరం అన్నారు.
జనాభా అవసరాలకు అనుగుణంగా, అత్యాధునిక, నాణ్యమైన వైద్యాన్ని పేద ప్రజలకు అందించేందుకు కేసీఆర్ ఆలోచనతో హైదరాబాద్ నలువైపులా టిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా వేగంగా అడుగులు వేసింది.
5 నెలలుగా ఆ నిర్మాణాలను, పనుల పర్యవేక్షణను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, లేని పోని ఆరోపణలు చెయ్యడం తగదన్నారు. ఆస్పత్రులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఆలోచన పక్కనపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తున్నది అని ఆరోపించారు.
టిమ్స్ ఆసుపత్రుల పట్ల కనీస అవగాహన కూడా లేకుండా ఆర్ అండ్ బి శాఖ మంత్రి మాట్లాడటం దురదృష్టకరం.
టిమ్స్ ఎల్బీనగర్ ఆసుపత్రి నిర్మాణం జి+14 అంతస్తులు మాత్రమే అయితే 27 అంతస్తులు అని మాట్లాడడం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవగాహన రాహిత్యానికి నిదర్శనం.
ఎక్కువ అంతస్తులు ఉంటే పేషెంట్లు ఇబ్బంది పడతారని ముసలి కన్నీరు కార్చుతున్న మంత్రి కి, ఏప్రిల్ 5, 2022 న జైపూర్ లో నాటి రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గ నిర్మిస్తున్న 24 అంతస్తుల ఆసుపత్రి ఎందుకు కనిపించడం లేదు.?
ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సిఎం అరవింద్ కేజ్రీవాల్ డిల్లీలో నిర్మిస్తున్న 22 అంతస్తుల ఆసుపత్రి ఎందుకు కనిపించడం లేదు.?
నిజంగా పేద ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే, త్వరితగతిన టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య సదుపాయాలు పెంచాలి. అంతేగానీ చవకబారు వ్యాఖ్యలు చేసి స్థాయిని మరింత తగ్గించుకోవద్దని హితవు పలికారు.