నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి కామారెడ్డి జూన్ 6:
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళకు మాయమాటలు చెప్పి ఆమె మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసును చోరీ చేసిన సంఘటన దేవుని పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.దేవునిపల్లి ఎస్సై రాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన మంచాల సత్తవ్వ అనే మహిళ కామారెడ్డి లోని ఎస్బిఐ బ్యాంకులో నుంచి తన అవసరం నిమిత్తం 2000 రూపాయలను డ్రా చేసుకొని నడుచుకుంటూ వెళుతుండగా మార్గమధ్యలో జీవధాన్ ఆసుపత్రి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి తారసపడి సదరు మహిళతో ముచ్చట కలిపాడు.దొంగలు తిరుగుతున్నారని,మెడలో అలా బంగారు గొలుసు వేసుకొని వెళ్లవద్దని నమ్మబలికాడు. మెడలో నుంచి బంగారు గొలుసు తీసివేసి పర్సులో పెట్టుకొని వెళ్లాలని సదరు వ్యక్తి మహిళ కు సూచించాడు.ఇది నమ్మిన మహిళ మూడు తులాల బంగారు గొలుసులు మెడలో నుంచి తీసి పర్సులో పెట్టే ప్రయత్నం చేస్తుండగా అలా కాదు అంటూ టవల్ లో చుట్టి పర్సులో పెట్టుకోవాలని సూచిస్తూ మెళ్లిగా ఆమెకు తెలియకుండానే గొలుసును తస్కరించి వెళ్లిపోయాడు.
జీవధాన్ ఆసుపత్రి దాటాక అనుమానం వచ్చిన సదరు మహిళ పర్సు చూసుకోగా అందులో బంగారు గొలుసు లేకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.