హుకుంపేట మండల కేంద్రంలో పూడుకుపోయిన కాలువలు
రహదారులపై మురికి నీటి ప్రవాహం
ఇళ్లల్లోకి చొచ్చుకొస్తున్న మురుగు
భరించలేని దుర్వాసనతో ప్రజల పాట్లు
నేటి గద్దర్ న్యూస్ హుకుంపేట మండల కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. కాలువలు పూడుకుపోవడంతో మురికి నీటి ప్రవాహం స్తంభించిపోయింది. దీనికితోడు వర్షాలు కురుస్తుండడంతో రహదారులపైకి చెత్తాచెదారం వచ్చేస్తోంది. అలాగే కాలువల్లోని వ్యర్థాలు నివాస గృహాల్లోకి చొచ్చుకు వస్తోంది. దీంతో స్థానిక ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు.
హుకుంపేట మండల నడిబొడ్డున రహదారులకు ఇరువైపులా ఉన్న మురుగు కాలువలు పూడుకుపోయాయి. దీంతో చిన్నపాటి వర్షం వస్తే చాలు వరద నీరు రోడ్లపై ఏరులై పారుతోంది. కాలువల్లోని చెత్తాచెదారం చిందరవందరవుతోంది. రోడ్లపై పోగులుగా చెత్త పేరుకుపోతోంది. అలాగే నివాస గృహల్లోని మురుగు వచ్చేస్తోంది. దీనికితోడు భరించలేని దుర్వాసన వెదజల్లడంతో ప్రజలు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. సమస్య తెలిసినప్పటికీ అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకునే పాపానికి పోవడం లేదని స్థానిక ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మండల కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, పారిశుధ్య సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామ ప్రజలకు ఒకటై రోడ్డెక్కుతామని వారు హెచ్చరించారు.