– సమ్మెకు దిగిన ఏరియా హాస్పిటల్ ఔట్సోర్సింగ్ కార్మికులు
– బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో చేర్చి కాంట్రాక్టు రద్దు చేయాలి
– సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ.జే రమేష్
– తక్షణం ఒక నెల వేతనం మంజూరు చేసిన ఐటీడీఏ పీవో
– మిగతా పెండింగ్ వేతనాలు పది రోజులలో చెల్లించే విధంగా కృషి చేస్తాం – ఎమ్మెల్యే తెల్లం హామీ
– ఎమ్మెల్యే హామీతో సమ్మె తాత్కాలిక విరమణ
– పది రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే తిరిగి సమ్మె కొనసాగిస్తాం – సిఐటియు
నేటి గదర్, జూన్ 10, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి :
భద్రాచలం ఏరియా హాస్పిటల్ నందు శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న 4 నెలల వేతనాలు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం విధులు బహిష్కరించి సమ్మె చేపట్టారు. తెల్లవారుజాము నుండి శానిటేషన్ పనులు నిలిపివేయడంతో ఎక్కడికక్కడ శానిటేషన్ పనులు స్తంభించిపోయాయి. సమ్మె శిబిరాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ.జె.రమేష్ ప్రారంభించి మాట్లాడుతూ… కార్మికుల ఆకలి బాధలు ప్రభుత్వానికి పట్టడం లేదని ప్రశ్నించారు. ప్రతి నెల 7వ తేదీ లోపు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలు చెల్లించాలని జీవోలో ఉన్నప్పటికీ సదరు కాంట్రాక్టర్ కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని, పిఎఫ్ ఈఎస్ఐ లకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు కార్మికులకు తెలియ చెప్పాల్సి ఉన్నప్పటికీ అలా చేయడం లేదని మండిపడ్డారు. కార్మికులకు రూ “15,600/- లు ఇవ్వాలని జీవోలో ఉన్నప్పటికీ కేవలం
రూ “11000/- లు మాత్రమే ఇస్తున్నారని, చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో చేర్చి కాంట్రాక్టు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులకు జీతాలు సక్రమంగా నెల నెల చెల్లించకపోవడం వల్ల ఇంటి కిరాయిలు కట్టుకోలేక, పాలు, కిరాణా బాకీలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెలా కార్మికులకు జీతాలు అందే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. సమ్మెతో శానిటేషన్ పనులు స్తంభించడంతో స్పందించిన హాస్పటల్ సూపరిండెంట్ డాక్టర్ ముదిగొండ రామకృష్ణ చొరవతో ఐటీడీఏ పీవో ఒక నెల వేతనం తక్షణమే మంజూరు చేయడం జరిగింది. హాస్పిటల్ చైర్మన్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు సమ్మె శిబిరానికి వచ్చి మిగతా రెండు నెలల పెండింగ్ వేతనాలు పది రోజులలో చెల్లించేందుకు కృషి చేస్తామని, కాంట్రాక్టర్ ను పిలిపించి కార్మికులు, సిఐటియు నాయకులు సమక్షంలో ఈఎస్ఐ, పిఎఫ్ ఇతర సమస్యలపై చర్చిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మెను తాత్కాలికంగా విరమించడం జరిగింది. ఇచ్చిన హామీలను 10 రోజులలో అమలు చేయకుంటే తిరిగి సమ్మె కొనసాగిస్తామని సిఐటియు నాయకులు, కార్మికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, సిఐటియు నాయకులు బండారు శరత్ బాబు, పి సంతోష్ కుమార్, జి లక్ష్మీకాంత్, భూపేంద్ర, రమాదేవి, కృష్ణ భవాని, సుల్తానా, శ్రీకాంత్,పెద్ద రమణ, తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ కార్మికుల సమ్మెకు ఐద్వా పట్టణ కమిటీ తమ సంఘీభావాన్ని తెలియజేసింది. ఐద్వా పట్టణ కార్యదర్శి డి లక్ష్మి పట్టణ ఆఫీస్ బేరర్స్ ఎన్. లీలావతి జి రాధా పట్టణ కమిటీ సభ్యులు కనక శ్రీ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.