– విప్లవోద్యమ నాయకురాలికి నివాళి CPI(ML)న్యూ డెమోక్రసీ రాష్ట్ర నేత ఆవునూరి మధు
నేటి గదర్, జూన్ 11,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :
అలవాల వంశీ 9052354516
సిపిఐ ఎంఎల్ ప్రతిఘటనోద్యమ నాయకురాలు కామ్రేడ్ రాదక్క మరణం విప్లవోద్యమానికి తీరని లోటు అని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అవునూరి మధు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు ఒక ప్రకటనలో సంతాపం తెలియజేశారు. ప్రముఖ ప్రతిఘటనోద్యమ, విప్లవోద్యమ నాయకురాలు కామ్రేడ్ రాధక్క అలియాస్ నిర్మలక్క (86) మంగళవారం ఉదయం 9 గంటలకు హైదరాబాదులో మరణించారని అన్నారు. ఆమె గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ, ఆమె కుమార్తె ఇంటి వద్ద ఉంటూ వైద్య చికిత్సను పొందుతున్నారని తెలిపారు. ఆమె పార్థీవ దేహం సింగరేణి కాలనీలో కుమార్తె ఇంటి వద్ద ఉన్నదని, ఆమె అంత్యక్రియలు 13వ తేదీ గురువారం ఉదయం జరుగుతాయని పేర్కొన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా విప్లవోద్యమంలో సిపిఐ( ఎం.ఎల్) చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ పనిచేశారని గుర్తు చేశారు. గోదావరి లోయ ప్రతిఘటన పోరాటంలో ఆమె ప్రముఖ పాత్ర వహించారన్నారు. కడదాకా పీడిత ప్రజల ఉద్యమంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటు సుదీర్ఘకాలం అజ్ఞాతవాసంలో గడిపారని వెల్లడించారు. అతివాద, మితవాదాలకి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పోరాటం చేశారని, విప్లవోద్యమంలో ఆమె వివిధ బాధ్యతలు వహించారన్నారు. విప్లవఉద్యమంలో కొంతకాలం జైలు జీవితం కూడా గడిపారని అన్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పేర్కొన్నారు.