“విత్తనం నుంచి పద్మం వరకు “పద్మ శ్రీ వానజీవి రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పలువురు నాయకులు, అధికారులు.స్పెషల్ స్టోరి పద్మ శ్రీ వానజీవి : నేటి గదర్ న్యూస్ : ఖమ్మం ప్రతినిధి : ✍️ సతీష్ కుమార్ జినుగు : ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణంలో గల రెడ్డిపల్లి అనే గ్రామానికి చెందిన వనజీవి రామయ్య, జూలై 1వ తారీఖు 1937లో లాలయ్య పుల్లమ్మ దంపతులకు జన్మించారు. అసలు పేరు దరిపల్లి రామయ్య,కానీ భారీగా మొక్కలను పెంచడం వల్ల ఆయన వనజీవి రామయ్యగా వాడుకలో పిలవబడుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో ఈయన చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది . కోటికిపైగా మొక్కలు నాటిన వ్యక్తి గా గుర్తింపు తెచుకొన్నారు.అతని స్వగ్రామం ముత్తగూడెం, పంటపొలాలు రెడ్డిపల్లిలో ఉండటంతో ఇక్కడికి చిన్నప్పుడే వచ్చి స్థిరపడ్డారు. విద్యాభ్యాసం : ముత్తగూడెం పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకున్నారు.
ఆ సమయంలోనే ఉపాధ్యాయుడు మల్లేశం ప్రబోధించిన ‘మొక్కల పెంపకం- లాభాలు’ అనే పాఠం అతనిలో స్ఫూర్తినింపింది. తన ఇంటిలోని 40 కుంటల స్థలంలో ఇల్లు పోను మిగతా భాగంలో చెట్లు నాటి వాటిని ప్రాణప్రదంగా పెంచారు. అది మొదలు రోడ్ల పక్కన ఖాళీ స్థలం, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, దేవాలయాలు.. ఇలా ఒకటేమిటి ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం రామయ్యకు నిత్యకృత్యమైంది. వృత్తిరీత్యా కుండలు చేస్తూ, పాలు అమ్ముతూ ప్రవృత్తి రీత్యా వనపెంపకానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న రామయ్య మొక్కలనే బహుమతిగా ఇస్తూ పెంచాలంటారు.రామయ్యకు ఆయన 15వ ఏట ఖమ్మంజిల్లా, కొణిజెర్ల మండలం తుమ్మలపల్లికి చెందిన జానమ్మతో ఇరువైపులా పెద్దల నిర్ణయంతో వివాహం అయ్యింది. వీరికి నలుగురు సంతానం అందులో ముగ్గురు కుమారులు ఒక్క కుమార్తె చిన్నతనం నుంచి కుటుంబ భారాన్ని మోస్తూనే 43 ఏళ్లుగా మొక్కలను పెంచుతున్నారు.
రామయ్య సంతానం :
రామయ్య జానమ్మల మొదటి కుమారుడు సైదులు ఇతనికి ఇద్దరు కూతుర్లు
రెండవ కుమారుడు సత్యనారాయణ ఇతనికి ఇద్దరు కొడుకులు సత్యనారాయణ కొన్నాళ్ళ క్రితం అనారోగ్యంతో మరణించాడు.
చివరి కుమారుడు కనకయ్య ఇతనికి ఇద్దరు కూతుర్లు
వీరి కూతురు పేరు సైదమ్మ
సైదులు కనకయ్యలు రెడ్డిపల్లిలోనే చెరొక కిరణ దుకాణం నడుపుకుంటూ తల్లిదండ్రులకు సహాయంగా వుంటున్నారు.రామయ్య 60 సంవత్సరాల వయస్సులోనూ అడవుల వెంట తిరుగుతూ వివిధ రకాల విత్తనాలను సేకరించి, మొక్కలు పెంచి, పదిమందికి పంచుతుంటారు. వేసవి వచ్చిందంటే వీరు అడవులు తిరుగుతూ రకరకాల విత్తనాలు సేకరిస్తుంటారు. వాటన్నింటిని బస్తాల్లో నింపి ఇంటి దగ్గర నిల్వచేస్తారు. ఎవరికీ తెలియని చెట్ల పేర్లు, . తొలకరి చినుకులు పడగానే మొక్కలు నాటే కార్యక్రమంలో మునిగిపోతారు. రోడ్లకు ఇరువైపులా, చెరువు కట్టల వెంట, జాతరలు, ఖాళీ జాగాల్లో, ఎక్కడ ఖాళీ ప్లేస్ కనిపిస్తే అక్కడ గింజలు నాటుతాడు. తొలకరి చినుకులు పడగానే ఆ గింజలను నాటేపని ప్రారంభిస్తారు. ఈ మొక్కలను పది మందికీ పంచి హరితహారం ఏర్పాటు చేస్తున్నారు. ఆయన యువతరం నుంచి నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా దర్శనమిస్తున్నాయి.పరిసరాలలో దొరికే అనేక వ్యర్ధ పదార్ధాల నుంచి తన ప్రచార సాధనాలను రామయ్య తయారుచేసుకోగలరు. ట్రాక్టర్లు బాగుచేసే షెడ్ లలో దొరకేగుంద్రని రింగులపై తన స్వంత డబ్బులతో రంగుడబ్బాలు కొని కుదిరినట్లు అక్షరాలు రాస్తారు. తలకి ఎప్పుడూ ఇటువంటి ఒక రింగును ఆహార్యంగా ధరించడం ద్వారా తను ఎక్కడికి వెళ్లనా మొక్కల పెంపకంపై అవగాహన కలిగించాలని కోరుకుంటారు. చిన్న చిన్న మంటి ప్లాస్టిక్ కుండలు పాత్రలు, రింగులు, డబ్బాలు ఇలా ఒక్కటేమిటి ఎటువంటి వస్తువునైనా మొక్కల పెంపకాన్ని ప్రొత్సహించే ప్రచార సాధనంగా మార్చడంలో రామయ్యగారు దిట్ట.
ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ‘‘వృక్షోరక్షతి రక్షిత:’’ అని రాసివున్న ప్లకార్డులను తగిలించుకుని వెళ్ళఇ అక్కడ ప్రచారం చేస్తారు. బంధువుల ఇళ్ళలో పెళ్ళిళ్ళకు వెళ్ళినా మొక్కలనే బహుమతులుగా ఇచ్చి వాటిని పెంచమని ప్రోత్సహించే వారు. అధికారుల గుర్తింపు :
2000 సంవత్సరంలో అప్పడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రామయ్య సేవలను గుర్తించి ఒక మోపెడ్ ను నెల నెలా 1500 రూపాయిల భత్యాన్ని కేటాయించారు. దీనిని మొక్కల ప్రచార రధంగా రామయ్య వినియోగించారు.ఎవరైనా రామయ్య వద్దకు వెళ్లి విత్తనాలు, మొక్కలు కావాలని అడిగితే.. అడిగినదానికంటే ఎక్కువ ఇచ్చి మొక్కలు నాటాలని, సంరక్షించాలని చెబుతుంటారు. ఏ శుభకార్యానికి వెళ్లినా విత్తనాలు, మొక్కలు తీసుకువెళ్లి ఇస్తుంటారు. పర్యావరణహిత కార్యక్రమాలకు వెళ్తే ‘వృక్షో రక్షితి.. రక్షితః’ తదితర నినాదాలు రాసిన ప్లకార్డులు సదరు ప్రాంతంలో ఏర్పాటు చేసిరావడం రామయ్య లక్షణం. రామయ్య సేవలకుగాను పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. రామయ్య 120 రకాల మొక్కల చరిత్రను తేలికగా వివరిస్తారు.మహారాష్ట్ర ప్రభుత్వం వనజీవి రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. అక్కడి తెలుగు విద్యార్థుల కోసం రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా రూపొందించారు. 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో రామయ్య జీవితం వనజీవిగా ఆయన కృషిని పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టారు. అవార్డులు : 2017 సంవత్సరానికి పద్మశ్రీ (సామాజిక సేవ).
2005 సంవత్సరానికి సెంటర్‌ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ నుంచి వనమిత్ర.
యూనివర్సల్ గ్లోబల్ పీస్ ’ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్.
1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవా అవార్డు.
ఖమ్మం రోటరీ క్లబ్ అవార్డు. ప్రముఖ రచయిత నరేష్ జిల్లా రామయ్య పై పద్మం నుంచి విత్తనం వరకు అనే తెలుగు పుస్తకం ని రాసి, అయన గురించి ఎంతో మందికి తెలిసేలా చేస్తున్నారు.