ఏడెనిమిది మందికి చోటు…
ఎవరెవరికి చాన్స్ దక్కేనో..?
నేటి గదర్ న్యూస్ స్టేట్ బ్యూరో జులై 2:
నైనారపు నాగేశ్వరరావు ✍️
తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది.సామాజిక సమీకరణాల ఆధారంగా చేసిన కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చినట్లుగా సమాచారం. అధిష్టానంతో చర్చించి తుది రూపు ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర ముఖ్య నేతలు ఇవాళ లేదా రేపు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.ఇప్పుడున్న మంత్రులలో శాఖలు కూడా మార్పులు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ కసరత్తు తుది దశకు చేరుకుంది. మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా మరో ఏడు ఎనిమిది మందికి చోటు కల్పించేందుకు అవకాశం ఉంది.ఇటీవల ఐదు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇతర సీనియర్ నాయకులు కాంగ్రెస్ పెద్దలతో మంత్రివర్గ విస్తరణ పై విస్తృతంగా సమాలోచనలు జరిగినట్లుగా విశ్వాసనీయ సమాచారం.సామాజిక సమీకరణాల ఆధారంగా నాలుగు మంత్రి పదవులకు ఎంపిక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది.రెడ్డి సామాజిక వర్గానికి రెండు,వెలమలకు ఒకటి,బీసీలకు ఒకటి చొప్పున మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఏఐసిసి అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వరించే అవకాశం బలంగా కనిపిస్తుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి,పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పోటీ పడుతున్నట్లుగా సమాచారం. నిజామాబాద్ నుండి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తుంది.ఈ ముగ్గురిలో ఒకరికి మాత్రమే మంత్రి పదవి లభించే అవకాశాలు కనిపిస్తుంది.మిగిలిన ఇద్దరిలో ఒక్కరికి ఆర్టీసీ చైర్మన్ పదవి,మరొకరికి ప్రభుత్వ చీఫ్ ఇచ్చే అవకాశం అధిష్టానం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.బీసీ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ కు మంత్రి పదవి పక్కా అయిందని సమాచారం.ఉమ్మడి ఆదిలాబాద్ నుండి ప్రాతినిధ్యం లేకపోవడంతో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కు మంత్రియోగం పట్టనుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క,మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఇవాళ లేదా రేపు ఢిల్లీ వెళ్లి మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంపై తుది చర్చలు జరపనున్నట్లు విశ్వసనీయ సమాచారం. పిసిసి అధ్యక్షుడు ఎంపికపై కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.ప్రభుత్వ పరంగా లాంచనాలు పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి తాజాగా గవర్నర్ రాధాకృష్ణన్ తో సమావేశం అయ్యారు.ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ పై చర్చించినట్లు సమాచారం.గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకాలపై కూడా చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది.విశ్వవిద్యాలయాల ఉపకులపత్తుల నియామకం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన ఆర్ ఓ ఆర్ చట్టం,ధరణి స్థానంలో భూమాత పేరుతో తేనున్న అత్యాధునిక వ్యవస్థ పైన చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.అదే విధంగా గత ప్రభుత్వంలో ఆమోదించిన గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న 12 బిల్లుల పైన చర్చించినట్లు సమాచారం.సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయి.ఈనెల ఏడో తేదీ లోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తుంది.