★ఎస్ ఐ ఆత్మహత్య పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
★ఎస్ ఐ కుటుంబానికి న్యాయం చేయాలి
★ తెలంగాణ గిరిజన సంఘం (టీజీఎస్) డిమాండ్
నేటి గదర్ న్యూస్, జులై 09( వైరా నియోజకవర్గ ప్రతినిధి. శ్రీనివాసరావు ):
చట్టాలు అమలు చేసే స్థానాల్లో ఉన్న పోలీసు శాఖలో కుల వివక్ష వేధింపులు ఉండటం వల్లే దళిత ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకుని మరణించాడని ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలని, సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బానోతు బాలాజీ, భూక్యా వీరభద్రం లు డిమాండ్ చేశారు.అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ 25 రోజుల కిందట నే తను ఎదుర్కొన్న వివక్ష వేధింపులపై జిల్లా సిపి కి లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసి కుల వివక్ష వేధింపులను వివరించిన ఫలితం లేకుండా ప్రాణం పొయింది అని వారు తెలిపారు,పోలీసు ఉన్నతాధికారులు సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే దళిత ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. సీఐ జితేందర్ రెడ్డి, కానిస్టేబుళ్లు కొందరు వేధించిన తీరు వల్లే మనస్తాపానికి లోనయ్యి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. పోలీసు శాఖలో జరుగుతున్న కుల వివక్ష వేధింపులపై ప్రక్షాళన చేపట్టాలని డిమాండ్ చేశారు. చట్టాలు అమలు చేసే స్థానాల్లో ఉన్న పోలీసుల శాఖలో ఈ వివక్ష కొనసాగితే గ్రామ సీమల్లో సాధారణ దళితులు, గిరిజనుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో రోజురోజుకీ దళితులు, గిరిజనుల ప్రజలు, ఉద్యోగులపై దాడులు దౌర్జన్యాలు పెరుగుతున్నాయని ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడంలో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం లోపాలు ఉన్నాయని ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు . ఎస్సై కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో దళిత, గిరిజన ఉద్యోగులు ,ప్రజలపై ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.