పురుడుపోసిన 108 సిబ్బంది
తల్లి బిడ్డ క్షేమం
జూలూరుపాడు, జూలై 20, నేటి గద్దర్ : 108 వాహనంలో గర్భిణీ స్త్రీ ప్రసవించిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలలోకి వెళ్తే మండల పరిధిలోని మొద్దులగూడెం గ్రామానికి చెందిన దొడ్డ మానస అనే నిండు గర్భిణీ శుక్రవారం అర్ధరాత్రి పురిటినొప్పులు రావడంతో విషయం తెలుసుకున్న ఆశ వర్కర్ విజయ 108 కి ఫోన్ చెయ్యగా, జూలూరుపాడు 108 సిబ్బంది హుటాహుటిన వెళ్లి జూలూరుపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గం మధ్యలో మానస కు నొప్పులు ఎక్కువ కావడంతో 108 వాహనంలో ఆశ వర్కర్ విజయ సహాయంతో ఈఎంటి రవి మహిళకు పురుడుపోశాడు.
మానస పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నారు. సకాలంలో స్పందించి పురుడు పోసిన 108 సిబ్బంది ఈఎంటి రవి, ఆశ వర్కర్ విజయ, 108 పైలెట్ తడికమల్ల శ్రీను కు మానస కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.