రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 24:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు శ్రీరాంనగర్ కాలనీలో ఉజ్వల స్కూల్ ప్రాంతంలో గత కొద్ది రోజుల నుండి పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.దీంతో కాలనీలో ప్రజలు బయటకు వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.అలాగే పాండ చెరువు కట్ట మీదుగా గోల్పర్తి నుండి పెద్దమ్మ దేవాలయం మీదుగా ఎర్రం విఠల్ ఫంక్షన్ హాల్ వరకు గుంపులు గుంపులుగా పిచ్చికుక్కలు సంచరిస్తున్నాయని ప్రజలు పేర్కొన్నారు.దాంతో పాండ చెరువు కట్ట పైనుండి బాటసారులు ఒకరిద్దరూ వెళ్తుంటే వెంట పడుతున్నాయని తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని ప్రజలు తెలిపారు.అదేవిధంగా గోల్పర్తి ఎక్స్ రోడ్ వద్ద ఉన్న శ్రీ భవాని శంకర అన్నప్రసాద వితరణ సేవా క్షేత్రంలో పిచ్చి కుక్కలు కరడంతో ఒక లేగ దూడ మూడు నెలల క్రితం చనిపోయిందని వారు పేర్కొన్నారు.అదే పిచ్చి కుక్కలు దినదినం పట్టణంలో అధికంగా పెరగడంతో ప్రజలకు సంకటంగా మారిందని వాపోతున్నారు.దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే ఏవైనా పనుల నిమిత్తం పిచ్చి కుక్కలతో భయపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ పిచ్చి కుక్కలు ఇండ్ల మధ్య కూడా సంచరించడంతో చిన్న పిల్లలు సైతం బయట ఆడుకుంటుండగా వారికి కూడా కరిచే ప్రమాదం ఉన్నందున తాము తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని ప్రజలు వెల్లడించారు.దీన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ అధికారులు తగు చర్యలు తీసుకొని పిచ్చికుక్కలను పట్టుకొని బంధించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.