నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, ఆగస్టు 15:
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు, సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క.
ఉత్సాహభరితంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానం లో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణంలో పంద్రాగస్టు కార్యక్రమాలు కొనసాగాయి.
ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,
స్త్రీ, శిశు, సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజనుద్దేశించి ప్రసంగించారు.
ములుగు జిల్లా 2019 లో ఏర్పడినప్పటినుండి వెనుకబడిన జిల్లాగా ఉండగా ఇప్పుడు కొత్త మెరుగులతో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి పథంలో తీసుకెళ్లుటకు నూతన ప్రణాళికలు రూపొందించాం. అందులో భాగంగా జిల్లాలో నూతన సమీకృత జిల్లా కార్యాలయముల సముదాయ భవననిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నవి. సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేయడం జరిగింది. రవాణా సౌకర్యం లేని మారుమూల గ్రామాలలోని ఆదివాసి గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు రాష్ట్రంలోనే తొలిసారిగా నూతన ఆలోచనతో రెండు కంటైనర్ హాస్పిటల్స్ మరియు పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ సమ్మక్క- సారలమ్మ మేడారం జాతరకు గతంలో ఎన్నడు లేని విధంగా 110 కోట్లు వెచ్చించి ఒక కోటి 50 లక్షల మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా జాతరను ముగించుకున్నాం.
గౌరవ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజా సంక్షేమం కోసం మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను.
మహాలక్ష్మి పథకం:- ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజుల్లోనే రెండు మానవీయ పథకాలను ప్రారంభించుకోవడం చాలా సంతోషం. తెలంగాణ ఆడబిడ్డలను మహాలక్ష్ములను చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన. అందులో భాగంగానే పైసా ఖర్చు లేకుండా మహిళలు ఆర్టీసి బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. డిసెంబర్ 9వ తేది మహాలక్ష్మి పధకం ప్రారంభం నుండి ములుగు జిల్లాలో ఇప్పటి వరకు 46లక్షల 66వేల 852 మంది మహిళలకు 25కోట్ల 10 లక్షల 71వేల 8వందల 23రూపాయలను ఖర్చు చేయడం జరిగినది.
జిల్లా ప్రజల సౌకార్యార్ధం జిల్లా కేంద్రం లో 2కోట్లు, మంగపేటలో 52 లక్షల నిధులతో మాడల్ బస్టాండ్,
ఏటూరునాగారం లో 4.5కోట్లతో కొత్త బస్ డిపో నిర్మించుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
వైద్య, ఆరోగ్య శాఖ : పేదలకు మెరుగైన వైద్య సేవలు, సదుపాయాలు విషయంలో ఏ వ్యక్తి ప్రాణాలు కోల్పోకూడదని, రాజీవ్ ఆరోగ్య శ్రీ అనే గొప్ప పథకాన్ని ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సేవలను మరింత విస్తృత పరిచి 10లక్షల వరకు ఉచిత వైద్యం పొందేలా తెచ్చిన పథకం లో భాగంగా జిల్లాలో 5లక్షల నుండి 10లక్షలకు పెంపు పథకంలో ఇప్పటి వరకు 3021 మందికి, 565 రకాల వైద్య సేవలకు గాను 6కోట్ల 28 లక్షల 45 వేల 804 రూపాయాల లబ్ధి జరిగింది. సీజనల్ వ్యాధుల నిర్మూలన కొరకు ఇంటింటి జ్వరం సర్వేలు ప్రతి 15 రోజులకు ఒక్క సారి నిర్వహించి, ఇప్పటి వరకు 44వేల 913గృహలను సందర్శించి లక్ష 46 వేల 408 మందిని పరీక్షించడం జరిగింది, అందులో 31మలేరియా, 11డెంగి కేసులు నిర్ధారించి, వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడం జరిగినది.
అటవీ ప్రాంతాలలో తక్షణ వైద్య సహాయం అందించుటకు రాష్ట్రం లోనే ఎక్కడ లేనివిధంగా నూతన ఆలోచనతో తాత్కాలిక కంటైనరులను సమ్మక్క- సారలమ్మ తాడ్వాయి మండలంలో పోచాపుర్ లో, వాజెడు మండలం లోని ఏడ్చర్లపల్లిలో నిర్మాణం చేయడం జరిగినది.
ప్రభుత్వ వైద్య కళాశాల: ఈ సంవత్సరం వైద్య విద్యార్ధుల అడ్మీషన్ కౌన్సిలింగ్ తదుపరి జిల్లాలో సెప్టెంబర్ మాసం లో ఎం.బి.బి.ఎస్. మొదటి సంవత్సరం తరగతులు నిర్వహించడానికి ప్రత్యేక వైద్య నిపుణులు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆర్తోపిడిక్స్, చెవి, ముక్కు, గొంతు, కంటి, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, ఇతర ప్రత్యేక భోధన విభాగాలు, అధునాతన తరగతి గదులు, ల్యాబ్, లైబ్రరి, లెక్చర్ హాలులు, విద్యార్థులకు నివాస వసతి తో సహ అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగినది. జిల్లాలో వైద్య విద్యను అభ్యసించుటకు వచ్చే నూతన విద్యార్థులకు ఆహ్వానిస్తున్నాను.
సమ్మక్క సారక్క గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయం: ఈ విశ్వవిద్యాలయం కోసం దాదాపు 337 ఎకరాల భూమి కేటాయింపు చేయడం జరిగినది. ఈ నెలలో అడ్మిషన్లు చేపట్టి, వచ్చే నెలలో మొదటి బ్యాచ్ ప్రారంభం కానున్నది.
ప్రజాపాలన కార్యక్రమం : ప్రజల చెంతకే ప్రభుత్వ యంత్రాంగం వెళ్లి ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం ఆరు గ్యారెంటీలు పథకాలకు ప్రజల నుండి 99,364 దరఖాస్తులు రాగా ప్రతి దరఖాస్తును పరిశీలించి, గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలు రాని దరఖాస్తుదారుల డేటా సవరణ ప్రజా పాలన మండల సేవా కేంద్రాల ద్వారా సరి చేయడం జరుగుతున్నది.
విద్యుత్ శాఖ: గృహ జ్యోతి పథకం ద్వారా జిల్లాలో 200 యూనిట్ల వరకు 37వేల 478విధ్యుత్ వినియోగదారులకు ఉచితంగా జీరో బిల్లులు అందించడం జరిగింది. తద్వారా ఇప్పటి వరకు రూ. 5కోట్ల 77లక్షల 88వేల లబ్ధిదారులకు సబ్సిడీ కల్పించాము. జిల్లాలో 26వేల 106 వ్యవసాయ బావులకు 110 కోట్ల వ్యయంతో 24 గంటల ఉచిత విద్యుత్, 250 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న నాయిబ్రాహ్మణులు, రజకులకు (సేలున్, దోభీఘాట్)లకు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం జరుగుతున్నది.
పౌర సరఫరాల శాఖ: నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ భారంగా మారకుండా మహాలక్ష్మి పథకం లో భాగంగా జిల్లాలో 45 వేల 352 మందిని అర్హులుగా గుర్తించి, ఇప్పటి వరకు 500 రూపాయల చొప్పున 71 వేల 768 సిలెండర్లను డెలివర్ చేసి, 2కోట్లకు పైగా సబ్సిడీని లబ్దిదారుల ఖాతాలో జమాచేశాం. జిల్లాలో ఇప్పటి వరకు రబీ, ఖరిఫ్ పంటలకు 144 కొనుగోలు కేంద్రముల ద్వారా ఒక లక్ష 47 వేల 907 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 20వేల 16మంది రైతులకు 323కోట్ల 09లక్షల రూపాయలను చేల్లింపు చేయడం జరిగింది.
మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర: ఆసియా ఖండములోనే అతి పెద్ద జాతర మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర అభివృద్ధి పనులు చేపట్టుటకు వివిధ శాఖలకు 110 కోట్లు రూపాయలను మంజూరి చేశాం. వివిధ శాఖల ద్వారా శాశ్వత, తాత్కాలిక పనులు చేపట్టి ఫిబ్రవరి 21వ తేది నుండి ఫిబ్రవరి 24వ తేది వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, మేడారం మహా జాతరను ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది లేకుండా జాతరను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఒక కోటి 50 లక్షల మంది భక్తులు దర్శించుకోవడం జరిగింది. ఈ జాతర నిర్వహణ ద్వారా మేడారం దేవస్థానమునకు 13 కోట్ల, 25 లక్షల 22వేల రూపాయలు ఆదాయం సమకూరింది.
జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ: గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో చేపట్టిన ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్స్ జిల్లాలో స్వయం సహాయక సంఘాల ద్వారా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో, బొగత వాటర్ ఫాల్స్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం మైక్రో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటుచేయడం జరుగుతుంది. స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు కల్పిస్తున్నాం. సర్కారు నిర్ణయంతో ఎక్కువ మంది మహిళలు రుణాలు తీసుకోవటానికి ముందుకొస్తున్నారు. మహిళా సంఘాలకు 2 లక్షల రూపాయల వరకు రుణ బీమా, 10 లక్షల వరకు ఇందిరా జీవిత బీమా పథకం ప్రవేశ పెట్టాం. ఇవి రెండు కొత్త పథకాలు.
మహిళా సంఘ సభ్యురాలు దురదృష్టవశాత్తు మరణిస్తే.. ఆమె పేరున ఉన్న రుణాన్ని ప్రభుత్వమె చెల్లిస్తుంది. ఎస్.హెచ్.జి. లకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశం తో జిల్లాలోని 19వేల 645మంది విద్యార్థులకు ఏకారూప దుస్తులను వీరి ద్వారా కుట్టించి విద్యార్థులకు అందజేయడం జరిగింది. కుట్టు చార్జీలను జతకు 50రూపాయల నుండి 75 రూపాయలకు పెంచి ఇవ్వడం జరిగినది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 16 లక్షల 49 వేల పనిదినాలు కల్పించి, 63 వేల 468 మంది కూలీలకు 34 కోట్ల 17 లక్షల రూపాయలను వేతనంగా చెల్లించడమే కాకుండా, 2 కోట్ల 22 లక్షల రూపాయలను మెటీరియల్ కొరకు ఖర్చు చేయడం జరిగిoది. బ్యాంకు లీకేజీ కింద 560 స్వశక్తి మహిళా సంఘాలకు 56 కోట్ల 30 లక్షల రుణాలు మంజూరు చేశాం. స్త్రీ నిధి కింద 37 వి.ఓ. లకు, 172 స్వశక్తి సంఘాల సభ్యులకు 6కోట్ల 2లక్షలు మంజూరు చేశాం. ఆసరా పెన్షన్ పథకం ద్వారా 39 వేల 103 మంది లబ్ధిదారులకు 9 కోట్ల 55 లక్షలు ప్రతి నెల పంపిణీ చేస్తున్నాం.
జిల్లా పంచాయతీ శాఖ : జిల్లాలోని 174గ్రామ పంచాయితీ లలో ట్రాక్టర్ల ద్వారా ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించి, డంపింగ్ యార్డులకు తరలించి గ్రామంలో పరిశుభ్రంగా ఉంచుతూ, నీటి సరఫరా ట్యాంకర్ల ద్వారా వన మహోత్సవం లో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీ, పల్లె ప్రగతి వనం లో, గ్రామాల్లో నాటిన మొక్కలకు ప్రతిరోజు నీటి సరఫరా చేయడం జరుగుతున్నది. గత నెలలో కురిసిన భారీ వర్షాలతో పలు గ్రామ పంచాయితీలలో వరద నీరు చేరడం వలన ముందస్తుగా వారిని పునరావాస కేంద్రాలను తరలించి, త్రాగునీరు అందించాం. యుద్ద ప్రాతిపదికన పారిశుద్ద పనులు చేపట్టి, ప్రజలు అంటు వ్యాదుల భారీన పడకుండా చర్యలు తీసుకోవడం జరిగినది. పారిశ్యుద్ధ కార్మికులకు మునుపు ఎన్నడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలను చెల్లిస్తుంది. అందులో భాగంగా జూలై మాసం వరకు 5 కోట్ల 51 లక్షల 95 వేల రూపాయలను చెల్లింపు చేయడం జరిగినది. జిల్లాలోని గుత్తికోయ నివాసాలకు కొత్త బోర్లను, హ్యండ్ పంపులను సమకూర్చి తాగు నీటిని సరఫరా చేసి చిరకాల సమస్యను పరిష్కరించడం జరిగినది.
స్వచ్చ దనం పచ్చదనం : పారిశుద్ధ్య నిర్వహణ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 5 నుండి 9వ తేదీ వరకు చేపట్టిన కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజల సహకారంతో అన్ని గ్రామపంచాయతీలలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 659 కిలో మీటర్ల రోడ్డు, 346 కిలో మీటర్ల డ్రైనేజీ కాలువలు, 207 లోతట్టు ప్రాంతాల శుభ్రం మరియు 117 శిథిలావస్థలో ఉన్న గృహాల తొలగింపు చేపట్టడం జరిగినది. అన్ని గ్రామ పంచాయతీలలో 6615 మంది శ్రమదానం చేయడం జరిగినది. వర్షపు నీరు నిలువ ఉండే 120 ప్రాంతాలను గుర్తించడం జరిగినది. 611 త్రాగు నీటి వసతులను శుభ్ర పరచడం జరిగినది. అన్ని గ్రామ పంచాయతీలలో క్లోరినేషన్ చేయడం మరియు 64 వేల 477 ఆయిల్ బాల్స్ వేయించడం జరిగినది. ANTI LARVA కెమికల్స్ మరియు ఫాగింగ్ చేయించడం జరిగినది. ఫీవర్ సర్వే ద్వారా 340 కేసులను గుర్తించడం జరిగినది. స్టెరిలైజేషన్ కొరకు 3458 కుక్కలను గుర్తించడం జరిగినది. 43వేల 405 గృహాలకు 6 మొక్కల చొప్పున ఒక లక్ష 73 వేల 620 మొక్కలు పంపిణీ చేయడం జరిగినది. 213 లోకేషన్లలో మొక్కలు నాటుటకు గాను 57 వేల 205 మొక్కలు, కమ్యూనిటీ ప్లాంటేషన్ కొరకు 1102 ప్రాంతాలలో 46 వేల 052 మొక్కలు, 284 విద్యా సంస్థలలో నాటుట కొరకు 18 వేల 975 మొక్కలను పెట్టడం జరిగినది.
వ్యవసాయ శాఖ :- వ్యవసాయ రంగం సంక్షేమంలో కూరుకొని అల్లాడిన రైతుల్లో తిరిగి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలు తేది.12-12-2018 నుండి తేది.09-12-2023 లోపు తీసుకున్న రైతులకు మొదటి, రెండవ విడతల్లో 19 వేల 644 రైతులకు 137కోట్ల 41 లక్షల వంట రుణమాఫీ చేయడం జరిగింది. 3 వ విడతగా ఈ రోజు 2 లక్షల వరకు ఋణామాఫీ చేయడం జరుగుతున్నది.
రైతు బీమా పథకం కింద జిల్లాలో 243 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున 12కోట్ల 15లక్షలను రైతుల నామినిల కుటుంబ ఖాతాలో జమ చేయడం జరిగింది. పి.ఎం. కిసాన్ పథకం కింద జిల్లాలో ఈ సంవత్సరం 4కోట్ల 71లక్షలను, 23వేల 565 రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది.
పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ: జిల్లాలో సి.ఆర్.ఆర్. పథకం ద్వారా 8 కోట్ల 69లక్షలతో 7 రోడ్లు, ఎం.ఆర్.ఆర్ పథకం ద్వారా 13కోట్ల 87లక్షలతో 15 రోడ్లు మంజూరు చేయడం జరిగినది. పనులు వివిధ దశలలో పురోగతి లో ఉన్నవి. గ్రామాలలోని 42 రోడ్ల మరమత్తులకు గాను ఎం.ఆర్.ఆర్ పథకం ద్వారా 70కోట్లు, సి.ఆర్.ఆర్. పథకం ద్వారా 22 రోడ్లకు గాను 45కోట్లతో పనులు మంజూరు కాబడినవి. అంతేకాకుండా సుమారు 250కోట్ల అంచనా వ్యయంతో సి.ఆర్.ఆర్., ఎం.ఆర్.ఆర్ పథకాల ద్వారా వివిధ రోడ్డు పనులు చేపట్టుట జరుగుతున్నది. ఎం.జి.యస్.ఆర్.జి.యస్. పథకం ద్వారా 17కోట్ల 16లక్షలతో 171 సి.సి. రోడ్ల పనులు చేపట్టడం జరిగినది.
రహదారులు, భవనముల శాఖ: జిల్లాలో ఎస్టి.యస్.డి.ఎఫ్., ఆర్.డి.ఎఫ్., తదితర పథకాల ద్వారా 68 పనులకు గాను 370 కోట్ల 98లక్షల నిధులు మంజూరు చేయడం జరిగినది. సమీకృత జిల్లా కార్యాలయముల సముదాయ భవనం (కలెక్టరేట్), రెసిడెన్షియల్ క్వార్టర్స్ నిమిత్తం 63 కోట్ల 50 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగినది. శరవేగంగా నిర్మాణం పనులు జరుగుచున్నవి.
నేషనల్ హైవే: 163 హైదరాబాద్ నుండి భూపాలపట్నం రోడ్డు ను జిల్లా పరిధిలో జంగాలపల్లి నుండి మచ్చాపూర్, చల్వాయి, గోవిందరావుపేట, పస్ర వరకు రెండు లేన్లను నాలుగు లేన్లుగా రోడ్డు వెడల్పు చేయుటకు 300 కోట్లు మంజూరు అయినవి. పనులు వివిధ దిశలలో జరుగు చున్నవి.
గిరిజన అభివృద్ధి శాఖ: గిరిజన భవనములు, NRHM, BTRoads, స్కూల్స్, వసతి గృహముల మరమ్మతులు జి.పి. మోడల్ స్కూల్స్ గురుకులములకు 106 కోట్ల 37లక్షల 69 వేలతో 424 పనులు మంజురుకాగా, 359 పూర్తి అయినవి. మిగతా పనులు పురోగతిలో ఉన్నవి.
నీటి పారుదల శాఖ : గత సంవత్సరం వానాకాలం, యాసంగి ఆయకట్టు కొరకు 1, లక్ష 63 వేల 350 ఎకరాలకు సాగునీరు అందించడం జరిగినది. ఈ సంవత్సరం వానాకాలంనకు గాను 1లక్ష 4వేల 838 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడం జరుగుతున్నది. దేవాదుల ఎత్తిపోతల పథకం కింద స్టేజ్ 1, 2కింద 7.50 లక్షల ఎకరాల ఆయ కట్టు స్థిరీకరణ జరుగుతుంది. రామప్ప, లక్నవరం గ్రావిటీ కెనాల్ కోసం లక్నవరం సరస్సు కింద 8 వేల 700 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం 14 కోట్ల 53 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది.
మిషన్ భగీరథ: మిషన్ భగీరథ బల్క్ సరఫరా ద్వారా జిల్లాలో 981 కి.మీ పైప్ లైన్ పూర్తి చేసి 480 ఆవాసాలకు త్రాగునీరు అందించుటకు ప్రభుత్వం 353 కోట్ల 89లక్షలు ఖర్చు చేయడం జరిగింది.148 కోట్ల 3లక్షలతో జిల్లాలో 1209.23 కి.మీ. పైపులైన్లతో 600 ఓ.హెచ్. ఎస్.అర్. ల నిర్మాణాలు పూర్తి చేసి, 88,029 గృహాలకు నల్ల కనెక్షన్లను ఇచ్చి త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతున్నది. జిల్లాలో ఇంటింటికి నల్లా పథకం లో భాగంగా ఇప్పటి వరకు నల్లా కనెక్షన్లు లేని ఇండ్లను గుర్తించుటకు సర్వే చేయించడం జరిగింది.
మహిళా, శిశు సంక్షేమ శాఖ: నూతన ప్రభుత్వం ఏర్పాటు కాగానే జిల్లా లోని 92 మిని అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేసి, మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి కల్పించడం జరిగినది. అంతేకాకుండా అంగన్వాడి టీచర్లు, ఆయాలకు పదవి విరమణ ప్రయోజనాలు కల్పిస్తున్నాం. జిల్లాలో బాలికల కొరకు బాలసదనం ఏర్పాటుకు గాను ప్రభుత్వం ఒక కోటి 35 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగినది.
జిల్లాలోని 640 అంగన్వాడి కేంద్రాలకు ప్రి స్కూల్ కిట్స్, 60 అంగన్వాడి కేంద్రాలకు ప్రీ స్కూల్ ఫర్నిచర్ అందించడం జరిగింది. బాల సదనం భవనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కోటి, 34లక్షల 93వేల 500 రూపాయలను మంజూరు చేయడం జరిగింది. దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమం కోసం ఈ ఆర్ ఎస్ స్కీం ద్వారా ఇద్దరూ ట్రాన్స్ జెండర్ పర్సన్ కి 50 వేల చొప్పున లబ్ది చేకూర్చడం జరిగింది. వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామంలో ప్రభుత్వ వృద్ధ ఆశ్రమ భవనం నిర్మాణం జరుగుతున్నది. సఖి కేంద్రం ద్వారా 561మంది మహిళలకు వివిధ రకాల సేవలు అందించడం జరిగింది. 3వేల 796 మంది గర్బిణి స్రీలకు, పాలిచ్చే తల్లులకు ప్రతి రోజు పోషక ఆహారభోజనం, పప్పు, కూరగాయలు పాలు, గుడ్డుతో కూడిన ఒక పూట సంపూర్ణ బోజనాన్ని అందిస్తున్నాము. అంగన్వాడి కేంద్రాలను కార్పొరేట్ స్కూల్లకు దీటుగా అన్ని హంగులతో జిల్లాలో తొలి విడతలో 60 అంగన్వాడి కేంద్రాలను తీర్చిదిద్దడం జరుగుతున్నది.
అమ్మ మాట- అంగన్వాడి బాట కార్యాక్రమంలో భాగంగా మహిళా శక్తి సంఘాల ద్వారా అన్ని అంగన్వాడి కేంద్రాలలోని పిల్లలకు రంగు రంగుల యూనిఫారాలు కుట్టించి సరఫరా చేయడం జరిగింది. 9వేల 660మందికి 7నెలల నుండి 3సం.ల లోపు చిన్నారులకు నెలకు 2.5కేజీల బాలామృతముతో పాటు 16 గుడ్లను అందిస్తున్నాము. 6వేల 729మందికి 3 నుండి 6 సం.ల లోపు పిల్లలకు ఒక గుడ్డు అన్నము, పప్పు, కూరగాయలు, స్నాక్స్ ప్రతి రోజు పంపిణి చేయడం జరుగుతున్నది. వికలాంగుల కోసం సదరం సర్టిఫికెట్లు పొందే ప్రక్రియను సులభతరం చేసాము. గతంలో కేవలం 7 రకాల వైకల్యాలను మాత్రమే సదరం క్యాంపులలో గుర్తించే వారు. ఇప్పుడు 21 రకాల వైకల్యాలను గుర్తించి సర్టిఫికెట్లను జారి చేస్తున్నాం.
షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ: జిల్లాలో పాఠశాల స్దాయిలో 6 ప్రి మెట్రిక్ వసతి గృహాలలోని 343 మంది విద్యార్థులకు 14లక్షల 28వేల ఖర్చు చేయడమైనది. పోస్ట్, ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్స్ క్రింద 1420 మంది విద్యార్థులకు 15లక్షల 85 వేలు ఖర్చు చేయడమైనది. కులాంతర వివాహం చేసుకున్న10 జంటలకు నగదు ప్రోత్సాహం కింద రూ. 25లక్షలు అందించడం జరిగినది.
వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ: జిల్లాలో 6 ప్రి, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలలో ప్రస్తుతం 395 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీరి కోసం 14లక్షల 15వేల రూపాయలు ఖర్చు చేయడమైనది. జిల్లాలో 1252 విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ ఫీజు రియంబర్స్ మెంట్ కోసం ఒక కోటి 54లక్షల 65వేలు ఖర్చు చేయడమైనది.
మైనారిటీ సoక్షేమ శాఖ : మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల సొంత భవననిర్మాణo కోసం 5 ఎకరాల స్థాలాన్ని కేటాయించడం జరిగినది. పోస్ట్ మెట్రిక్ ఉప కార వేతనం కింద విద్యార్థులకు గాను 6లక్షల 23వేలు మంజూరు చేయడం జరిగినది.
రెవెన్యూ శాఖ : 2024-25 సంవత్సరంలో కళ్యాణ లక్ష్మీ/షాదీముబారక్ పథకాల క్రింద వివాహాలు జరిగిన పేద కుటుంబాలకు రూ. 1 లక్ష 116/-ల చొప్పున కోటి 91లక్షల 22వేల రూపాయలను 191 మంది లబ్ధిదారులకు అందించడం జరిగినది.
ధరణి: జిల్లాలోధరణి పోర్టల్ లో 11 వేల 584 దరఖాస్తులు రాగా 10వేల 961 పరిష్కరించబడినవి. భూ సమస్యల పరిష్కారం దిశగా నూతన రెవెన్యూ చట్టం అమలు ముసాయిదాను తయారు చేసి ప్రజల నుండి అభిప్రాయలు సేకరించడం జరుగుతున్నది.
ఇందిరమ్మ ఇండ్లు : నిరుపేదలు ప్రతి ఒక్కరికీ సొంత ఇంటికల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తోంది. ఇందులో బాగంగా మన జిల్లాకు 3790 ఇండ్లను మంజూరు చేయడం జరిగింది.
అటవీ శాఖ: వనమహోత్సవము లో భాగంగా 174 గ్రామపంచాయితీలలో 13 లక్షల 44 వేల మొక్కలను నాటడం జరుగుతుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా వివిధ శాఖలలోని నర్సరీలలో 26 లక్షల 40 వేల మొక్కలను పెంచడం జరిగినది.
ఉద్యానవన శాఖ: సూక్ష్మ నీటి సేద్య పథకంలో భాగంగా 125 మందికి 395.36 ఎకరాలలో 87లక్షల 56వేల విలువైన బిందు సేద్యం పరికరాలు ఇవ్వడం జరిగినది. సమీకృత జాతీయ నూనె గింజల, పామ్ ఆయిల్ పథకంలో భాగంగా 269 మంది రైతులకు 859.48 ఎకరాలలో పరిపాలన అనుమతితో 32లక్షల 55వేల రూపాయలను సబ్సిడీ ఇవ్వడం జరిగినది.
విద్యాశాఖ:- ఈ సంవత్సరం ఇంటర్మీడియెట్ ఫలితాలలో ములుగు జిల్లాను మొదటి స్థానంలో నిలిపిన విద్యార్థిని, విద్యార్థులకు, అధ్యాపకులకు అభినందనలు. వెంకటాపురం లో కొత్తగా ఇంటర్ మీడియట్ కళాశాలను ప్రారంభించుకోవడం జరిగినది. జిల్లాలో ఉన్న 7 కళాశాలలకు టాయిలెట్ బ్లాక్స్, 39 లక్షల తో ప్రహరీ గోడ, ఐరన్ గ్రీల్స్ కల్పించడం జరిగినది. ప్రభుత్వ పాఠశాలలను సమగ్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించగా జిల్లాలో 246మందికి లబ్ధిచేకూరడం జరిగినది. కొత్తగా మంగపేట, కన్నాయి గూడెం లలో కే.జీ.బి.వి, భవనాలను నిర్మించుకొని ప్రారంభించుకోవడం జరిగినది. జిల్లాలోని 552 పాఠశాలకు గాను 318పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ద్వారా 8కోట్ల 42లక్షలు మౌలిక వసతుల కల్పన కొరకు ఖర్చు చేయడం జరిగినది. 42వేల 816మంది విద్యార్థిని, విద్యార్థులకు 1లక్ష 71వేల 260పాఠ్యపుస్తకలు, 95వేల 913నోట్ బుక్స్, ఉచితంగా అంధిచడం జరిగింది.
పోలిస్ శాఖ:ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు బహూకరించారు. ప్రభుత్వం వివిధ పథకాల కింద మంజూరు చేసిన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పంద్రాగస్టు వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. ఎదనిండా దేశ భక్తిని నింపుకుని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులను ముఖ్య అతిథి, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పి శబరిష్, ఐ టి డి ఏ పి. ఓ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ, ఓ ఎస్ డి మహేష్ బాబా గీతే, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి.హెచ్. మహేందర్ జి., ఆర్డీఓ కె. సత్య పాల్ రెడ్డి, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.