ప్రాజెక్టులపై చర్చకు మేము సిద్ధమే..
మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు సిద్దమా?
వైరా సభ నుంచి సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు
ప్రాజెక్టుల రీ డిజైన్ పేరిట ప్రజాధనాన్ని దోపిడీ చేసిన గత బిఆర్ఎస్ పాలకులు
రూ. 30 వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటే ప్రాణహిత చేవెళ్ల, ఇందిరా, రాజీవ్ సాగర్ ప్రాజెక్టుల ద్వారా 21.50 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేవి
దోపిడీ చేయడానికి రీ డిజైన్ చేసిన ప్రాజెక్టు మీ మానస పుత్రికనే
దేశ చరిత్రలోనే రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వానిది
పది ఏండ్లు అధికారంలో ఉండి లక్ష రూపాయలు రుణమాఫీ చేయని గత ప్రభుత్వం
సవాల్ విసిరిన 15 రోజుల్లోనే రుణమాఫీ చేసిన నిబద్దత కాంగ్రెస్ ప్రభుత్వానిది
సాగునీటి ప్రాజెక్టులపై చర్చించడానికి ఇరిగేషన్ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, (రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క) నేను సిద్ధంగా ఉన్నామని టైం, ప్లేస్ ఎక్కడో చెప్తే అక్కడికి వస్తామని, చర్చకు రావడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావులు సిద్ధమేనా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా రీ డిజైన్ పేరిట బిఆర్ఎస్ పాలకులు దోపిడీకి పాల్పడ్డారని దుయ్యబట్టారు. రెండు లక్షల రుణమాఫీ సందర్భంగా గురువారం ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్లు ఇచ్చేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇందిరా, రాజీవ్ సాగర్ లకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. 2016 నాటికి దాదాపుగా పనులు పూర్తి కావచ్చాయని కేవలం రూ. 1548 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే ఈ ప్రాజెక్టులకు రీ డిజైన్ పేరిట రూ. 23 వేల కోట్లకు పెంచి, ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఎకరానికి కూడా 10 సంవత్సరాల్లో నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. రూ.38 వేల కోట్ల రూపాయలతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులు మొదలు పెట్టి రూ. 10 వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఖర్చు అయిందన్నారు. కేవలం రూ. 28 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు 1.25 లక్షల కోట్ల రూపాయలకు రీ డిజైన్ పేరిట అంచనాలు పెంచి గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజల సొమ్మును దోపిడీ చేసిందన్నారు. కేవలం రూ. 30 వేల కోట్లు రూపాయలు ఖర్చు పెడితే రాష్ట్రంలో 21 లక్షల 50 వేల ఎకరాలు సాగులోకి వచ్చి ఉండేదన్నారు. కేవలం కమిషన్ల కోసం రీ డిజైన్ ల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన గత బిఆర్ఎస్ పాలకులు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తమ మానస పుత్రిక అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తి కానప్పటికీ డబ్బులు దండు కోవడానికి పంపులను కొనుగోలు చేసి తీసుకొచ్చారని, నిరుపయోగంగా ఉండటంతో తుప్పు పట్టి పోకుండా వాటిని వినియోగంలోకి తీసుకురావాలని అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం కేవలం 75 కోట్లతో రాజీవ్ లింకు కెనాల్ నిర్మాణం చేసి వైరా ప్రాజెక్టుకు నీళ్లు తీసుకొచ్చి అక్కడ నుంచి ఎన్ ఎస్ పి ఎల్ కాలువల ద్వారా 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు పంప్ హౌస్ లను ప్రారంభించిన ఈరోజు రాష్ట్ర చరిత్రలో లిఖించబడుతుందన్నారు.
*దేశంలోనే రూ. 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిది*
దేశ చరిత్రలో కనివిని ఎరుగని విధంగా ఏ రాష్ట్రం చేయని విధంగా ఏకకాలంలో 2 లక్షల రూపాయలను రైతులకు రుణమాఫీ చేసిన ఘనత ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. అమలు చేయడం సాధ్యం కాదు అన్న రెండు లక్షల రూపాయల రుణమాఫీని సుసాధ్యం చేసిన ఈరోజు దేశ చరిత్ర లో లికించబడుతుంది అన్నారు. రాజకీయ ఓనమాలు దిద్దిన వైరాలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసే బాధ్యత దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పాలకులు లక్ష రూపాయల కూడా రుణమాఫీ చేయలేదన్నారు. సవాల్ విసిరిన 15 రోజుల్లోనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వాన్నిదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి తేడా ఏంటో ప్రజలే గమనించాలని అన్నారు. నవ్వుతూ నా భవిష్యత్తు అన్నట్టుగా రాష్ట్ర చరిత్ర ఎన్నడు లేని విధంగా వ్యవసాయ శాఖకు ఈ వార్షిక సంవత్సరం బడ్జెట్లో రూ. 72 వేల కోట్లు కేటాయించిన ఘనత ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఒకవైపు వ్యవసాయాన్ని మరోవైపు పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. విదేశాలకు వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబులు ఈ రాష్ట్రానికి రూ. 36 వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినందుకు రాష్ట్ర ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.