నేటి గదర్ న్యూస్ , ఆగస్ట్ 31 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
ఎన్ఆర్ఐ పేరేంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో నేలకొండపల్లి మండలం సిపిఎం పార్టీ కార్యాలయంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ప్రారంభించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ .. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్యాన్సర్ మహ్మమరి విస్తరిస్తోంది. క్యాన్సర్ పట్ల గ్రామాల్లో సరైన అవగాహన లేకపోవడంతో పాటు క్యాన్సర్ చికిత్స ఖరీదైనది కావడంతో క్యాన్సర్ బారినపడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి సమయంలో గ్రామీణ ప్రాంతాలకు వచ్చి ఉచిత కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అని అన్నారు. విదేశాల్లో ఉంటూ ఇక్కడ అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్న ఎన్నారై లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.