నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు.
వాచ్మెన్, అపార్ట్మెంట్ ఓనర్ ఇమామ్ పాషా కు నిర్వహకుడు కృష్ణారెడ్డి ఆదేశం . కరుణగిరి సమీపంలోని శ్రీ సాయి నిలయంలో అడ్డగోలు వ్యవహారం.
కుల వివక్షత చూపించడం సరికాదు : పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భూక్యా.సురేష్ నాయక్
ఖమ్మం రూరల్ : రాజ్యాంగం అమలవుతున్న రోజుల్లోనూ కుల వివక్షత ఏ విధంగా ఉందో ఈ ఘటనను ఉదాహరణగా చెప్పవచ్చు… ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై కుల వివక్షత నానాటికి పెట్రేగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఓ ముస్లిం తన అపార్ట్మెంట్ ని ఎస్సీ , ఎస్టీ ముస్లింలకు ఇవ్వద్దంటూ దాని నిర్వహకుడు కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఆడియో సంభాషణ సోమవారం వాట్సప్ గ్రూపులో చెక్కర్లు కొట్టడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే. ఖమ్మం రూరల్ మండలంలోని పోలేపల్లి పంచాయతీ లో గల కరుణగిరి సమీపంలోని శ్రీ సాయి నిలయం అపార్ట్మెంట్లో అడ్డగోలు వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. అందులోని 406 అపార్ట్మెంట్ ఓనర్ ఇమామ్ పాషా తన ఫ్లాట్ ను కిరాయి ఇచ్చేందుకు టు లెట్ బోర్డు పెట్టాడు. కాగా ఎస్టి సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి కిరాయి కోసం అక్కడికి వెళ్ళాడు. వాచ్ మెన్ ని అపార్ట్మెంట్ రెంటుకు కావాలని అడిగాడు. దీంతో సదరు వాచ్మెన్ మీది ఏ కులం అని ఆ వ్యక్తిని అడిగాడు. సదరు వ్యక్తి తాను ఎస్టి కులానికి చెందిన వాడినని చెప్పడంతో సదర్ వాచ్మెన్ తమ నిర్వకులు కృష్ణారెడ్డి, శ్రీనివాసులు ఎస్సీ, ఎస్టీ ,ముస్లింలకు ఫ్లాట్ రెంటుకు ఇవ్వద్దని చెప్పినట్టుగా తెలిపాడు. దీంతో సదరు వ్యక్తి అదే ఫ్లాట్లో ఉండే శరత్ అనే వ్యక్తి ద్వారా కృష్ణారెడ్డికి మాట్లాడించాడు. ఇదేం పద్ధతి మీరు ఎస్సీ, ఎస్టీ ,ముస్లింలకు ఇంటిని ఇవ్వొద్దని చెప్పడం సరికాదని వాదించాడు. అయినప్పటికీ సదరు కృష్ణారెడ్డి అవును ఇవ్వడం కుదరదు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ వ్యాఖ్యానించాడు. దీనిపై పోలీసులు, అధికారులు చర్యలు తీసుకొని ఇటువంటి ఘటనలు మరో మారు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందనేది స్పష్టంగా కనిపిస్తుంది.
కుల వివక్షత చూపించడం సరికాదు.
వివిధ కులాలు, మతాలు, విభిన్న ప్రాంతాల ప్రజలు కలిగిన ప్రజాస్వామ్య దేశంలో ఇంకా కుల వివక్షత పొడచూపుతూనే ఉండడం బాధాకరమని పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు భూక్య సురేష్ నాయక్ అన్నారు. అపార్ట్మెంట్ సాక్షిగా చోటు చేసుకున్న కుల వివక్షత ఘటన సరికాదన్నారు. ముస్లిం ఓనర్ ని ఓ అగ్రకులస్తుడు బెదిరించి ఎస్సీ ,ఎస్టీ, ముస్లింలకు ఇవ్వద్దని హుకుం జారీ చేయడం హేయమైన చర్య అన్నారు. దయచేసి ఇలా కుల వివక్షత చూపించి ఎస్సీ, ఎస్టీ, ముస్లింల మనోభావాలను దెబ్బతీసే వ్యవహారాలను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను పోలీసులు సుమోటోగా తీసుకొని సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు.