నేటి గదర్ న్యూస్,పినపాక:
– భూపాలపట్నం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి కనీస వసతి సదుపాయాలను కల్పించే లక్ష్యంగా అర్హత ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లును అందిస్తుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండలంలోని భూపాలపట్నం గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం అమలులో విఫలమైందన్నారు. ప్రజా ప్రభుత్వం పేదలను గుర్తించి పారదర్శకంగా వారికి అనువైన సొంత ఇంటి స్థలాల్లోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తుందన్నారు. దశలవారీగా పేదలకు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని, కనీస సదుపాయాలైన కూడు, గూడు, విద్యా వైద్యం, ఉపాధి కల్పించి, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పల కుప్పగా చేసి, బీ ఆర్ ఎస్ రాష్ట్రాన్ని లూటీ చేసిందన్నారు. ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న, పేదలకు అందించే సంక్షేమ పథకాలను విస్మరించబోమని అన్నారు. కార్యక్రమంలో పినపాక తహశీల్దార్ అద్దంకి నరేష్, ఎంపిడిఓ సునీల్ కుమార్, ఎంపీఓ కే వెంకటేశ్వరరావు, పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాథం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
