వీరవనితలు పుట్టిన గడ్డపై తెలంగాణ ఆడబిడ్డలకు అవమానకరం.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు.
నేటి గదర్ న్యూస్, వైరా ప్రతి నిధి:
వీరవనితలు పుట్టిన నెలపై తెలంగాణ ఆడబిడ్డలకు ఘోర అవమానం జరిగిందని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ… అందాల పోటీలకు వచ్చిన యువతుల కాళ్ళను మహిళలతో రాష్ట్ర ప్రభుత్వం కడిగించడం సరికాదన్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ అభిమానాన్ని అందాల పోటీకి వచ్చిన సుందరిమణుల పాదాల దగ్గర పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. విదేశీ అందగత్తెలకు తమ కాలు కడిగి రుమాలతో తుడిపించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ చర్య మహిళలకే కాదు తెలంగాణ సమాజానికి జరిగిన అవమానమని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలతో మిస్ వరల్డ్ పోటీదారుల కాలు కడిగించడం, తుడిపించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని, తెలంగాణ గర్వించే సమ్మక్క, సారక్క పుట్టిన ప్రాంతంలో ఇలాంటి అవమానం జరగడం బాధాకరమన్నారు. యావత్ మహిళా లోకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ వనితల సత్తా చూపిస్తామని హెచ్చరించారు.









