వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం
ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ
నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: అశ్వారావుపేట మండలం, వేదాంతపురం గ్రామపంచాయతీ పరిధిలో గత కొంతకాలంగా వేధిస్తున్న విద్యుత్ సరఫరా ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా గ్రామ సర్పంచ్ తోట వెంకటమ్మ చొరవ చూపి బుధవారం ఎన్పీడీసీఎల్ ఏడీ ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న లో-వోల్టేజ్ సమస్యలు, తరచూ ఎదురవుతున్న విద్యుత్ అంతరాయాల వల్ల ప్రజలు పడుతున్న అవస్థలను ఆమె అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన ఏడీ తక్షణమే క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి తగిన ఎస్టిమేట్స్ సిద్ధం చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం విద్యుత్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు వెంటనే చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు మాజీ సర్పంచ్ సోమిని శివ శంకర ప్రసాద్, ఉపసర్పంచ్ సంగీత వీర్రాజు, వార్డు సభ్యులు గణప వెంకటలక్ష్మి, గడ్డం మహాలక్ష్మి మరియు తోట వెంకటస్వామి తదితరులు పాల్గొని విద్యుత్ సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందించారు.








