నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6గ్యారెంటీ హామీల అమల్లో భాగంగా స్పీడ్ పెంచింది. ఇప్పటికే నాలుగు హామీలు కార్యరూపం దాల్చాగా మార్చి 11న మరో గ్యారంటీ పథకం ప్రారంభం కానుంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం వివరాలు వెల్లడించారు.ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని మార్చి 11న ప్రారంభించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి. ఇల్లు లేని అర్హులందరికీ పథకం వర్తింపజేయాలని, అందుకు అనుగుణంగా వెంటనే విధివిధానాలను తయారు చేయాలని సూచించారు.
ఈ పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తారు. అందుకు సంబంధించిన నిబంధనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సీఎంతో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
