నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 26, భద్రాద్రి కొత్తగూడెం :
ఏజెన్సీలో విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని భద్రాచలం ఐటిడిఏ పిఓ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం నాడు తన చాంబర్లో లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివి అత్యుత్తమ ర్యాంకులతో ఐఐటీలో సీటు పొందడానికి అర్హత సాధించిన విద్యార్థినిలకు ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ లను ఆయన అభినందించారు. సాహితి 5756 ర్యాంకు, నిహారిక 9722 ర్యాంకులు సాధించి భద్రాచలం ఖ్యాతిని పెంచారని ఆయన అన్నారు. ఏజెన్సీలో విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఈ విద్యార్థినిలను ఆదర్శంగా తీసుకొని మిగతా విద్యార్థిని, విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో పాసై ఎంట్రెన్స్ రాసి ఐఐటి లలో సీటు సంపాదించి, కాలేజీకి, అధ్యాపకులకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆయన అన్నారు. ఏజెన్సీలో విద్యాభివృద్ధి కోసం ఐటీడీఏ అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మాగంటి రమేష్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ ఎండి.బషీర్, విద్యార్థినీలు పాల్గొన్నారు.