– అనుమతి పొందిన వాహనాలనే ప్రచారంలో ఉపయోగించాలి
– ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాంకుమార్ గోపాల్
నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 26, భద్రాద్రి కొత్తగూడెం :
ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురికాకుండా అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి అక్రమ మద్యం, డబ్బు రవాణాను అరికట్టాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాంకుమార్ గోపాల్ అన్నారు. శుక్రవారం భద్రాచలం పట్టణ సరిహద్దుల్లో ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన నాలుగు చెక్ పోస్ట్ లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చెక్ పోస్ట్ ల వద్ద పనిచేసే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి ప్రతి వాహనాన్ని చెక్ చేయాలని, ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా చెక్ పోస్ట్ ల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం, డబ్బు, ఇతర బహుమతులను తరలించకుండా అరికట్టాలని అధికారులకు సూచించారు. అలాగే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్ వేసిన నాటి నుండి పోలింగ్ జరిగే వరకు ప్రతి రూపాయి ఖర్చును వ్యయ పరిశీలకుల బృందాలు పకడ్బందీగా నమోదు చేయాలని, అన్ని బృందాలు సమన్వయంతో పనిచేయాలని డబ్బు, మద్యం ప్రలోభాలకు లొంగకుండా ప్రజలను చైతన్య పరచాలని తెలిపారు. ర్యాలీలు, సమావేశాలు జరిగినప్పుడు తప్పనిసరిగా ముందుగా అనుమతి పొందిన వాహనాలను ప్రచారంలో ఉపయోగించాలని, ఎవరైతే అనుమతి తీసుకోకుండా ప్రచార వాహనాలు, సభలు, ర్యాలీలు నిర్వహిస్తే ఈసీ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయించిన ధర ప్రకారము ఖర్చు నమోదు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ ఆఫీసర్ వేల్పుల శ్రీనివాసరావు, లైజనింగ్ ఆఫీసర్ పృధ్విరాజ్, సిఐ సంజీవరావు, ఎఫ్ఎస్టి బృందం అధికారి మధు తదితరులు పాల్గొన్నారు.