– మండల ప్రాధమిక వైద్యాధికారి డా. స్రవంతి
నేటి గదర్, మే 16, బోనకల్ :
సమాజ భాగస్వామ్యంతోనే డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం అని బోనకల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. స్రవంతి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగ్యూ దినోత్సవ నివారణ, అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలోని ప్రజలందరి భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం! అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రజలందరి బాధ్యత అని అన్నారు. డెంగ్యూ వ్యాధి రాకుండా దోమలు కుట్టకుండా ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడాలని సూచించారు. దోమల వల్ల వచ్చే డెంగీ మనిషిలో అభివృద్ధి చెందే విధానం, వ్యాప్తి, జాగ్రత్తలను గురించి వివరించారు. ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల డెంగ్యూ వ్యాపిస్తుందని, ఇది వర్షాకాలంలో విజృంభిస్తోందన్నారు. రానున్న వర్షాకాలంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటి ఆవరణలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించాలని సూచించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సిహెచ్ శ్రీనివాసరావు, ఆరోగ్య పర్యవేక్షకులు దానయ్య, స్వర్ణమార్త, స్టాఫ్ నర్స్ భవాని, రమ, ఏఎన్ఎం సరస్వతి, ల్యాబ్ అసిస్టెంట్ యాకుబ్, ఆశా కార్యకర్తలు ఎం లీలా కుమారి, దుర్గా, గంగుల విజయలక్ష్మి, గద్దె తులసి, కుమారి, పద్మ, కృపారాణి, ఉష, జె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.